Telugu Murli 11/07/20

11-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – మేము బాగా చదువుకుని స్వయానికి స్వయమే రాజ్యతిలకము దిద్దుకోవాలి అన్న ఒకే చింతలో సదా ఉండండి, చదువు ద్వారానే రాజ్యము లభిస్తుంది”

ప్రశ్న:- పిల్లలు ఏ ఉల్లాసములో ఉండాలి? ఎందుకు నిరుత్సాహపడకూడదు?

జవాబు:- మేము ఈ లక్ష్మీనారాయణుల్లా అవ్వాలి అన్న ఉల్లాసము మీకు సదా ఉండాలి. దీని కోసం పురుషార్థము చేయాలి. ఎప్పుడూ నిరుత్సాహులుగా అవ్వకూడదు, ఎందుకంటే ఈ చదువు చాలా సహజమైనది. ఇంట్లో ఉంటూ కూడా చదవవచ్చు. దీనికి ఎలాంటి ఫీజు లేదు, కానీ ధైర్యము తప్పకుండా ఉండాలి.

గీతము:- మీరే మాతా పితలు… (తుమ్ హీ హెూ మాతా-పిత…)

ఓంశాంతి. పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. మహిమ ఒక్కరిదే. ఇంకెవ్వరి మహిమ గాయనము చేయబడదు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా ఎటువంటి మహిమా లేదు. తండ్రి బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారు, శంకరుని ద్వారా వినాశనము చేయిస్తారు, విష్ణువు ద్వారా పాలన చేయిస్తారు. లక్ష్మీనారాయణులను కూడా ఇటువంటి యోగ్యులుగా శివబాబాయే తయారుచేశారు. మహిమంతా వారిదే. వారిది తప్ప ఇంకెవరి మహిమను గాయనము చేయాలి? లక్ష్మీనారాయణులను కూడా అలా తయారుచేసే టీచర్ లేకపోతే వారు కూడా అలా తయారయ్యేవారు కాదు. వారి తర్వాత, రాజ్యపాలన చేసే సూర్యవంశీయులకు మహిమ ఉంది. తండ్రి సంగమయుగములో రానట్లయితే వీరికి రాజ్యము కూడా లభించదు. మరి ఇంకెవ్వరికీ మహిమ లేదు. విదేశీయులు మొదలైన వారెవ్వరినీ మహిమ చేయాల్సిన అవసరము లేదు. మహిమ కేవలం ఒక్కరిదే, ఇంకెవ్వరికీ లేదు. ఉన్నతాతి ఉన్నతమైనవారు శివబాబా మాత్రమే. వారి నుండే ఉన్నతపదవి లభిస్తుంది. కనుక వారిని బాగా స్మృతి చేయాలి కదా. స్వయాన్ని రాజులుగా తయారుచేసుకునేందుకు మీకు మీరుగానే చదువుకోవాలి. బారిస్టరీ చదివేవారు, స్వయాన్ని ఆ చదువు ద్వారా బ్యారిస్టర్లుగా తయారుచేసుకుంటారు కదా. శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారే ఉన్నతపదవిని పొందుతారు. చదువుకోనివారు పదవిని పొందలేరు. చదువుకునేందుకు శ్రీమతము లభిస్తుంది. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము, దీనికోసమే ఈ చదువు ఉంది. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా, పతితులుగా ఉన్నారని మీకు తెలుసు. మంచి మరియు చెడు మనుష్యులు అయితే ఉంటారు కదా. పవిత్రంగా ఉండేవారిని మంచివారని అంటారు. బాగా చదువుకుని గొప్ప వ్యక్తులుగా అయినప్పుడు వారి మహిమ జరుగుతుంది. కానీ నిజానికి అందరూ పతితులే. పతితులే పతితులను మహిమ చేస్తారు. సత్యయుగంలో పావనులుంటారు. అక్కడ ఎవ్వరూ ఎవ్వరి మహిమను చేయరు. ఇక్కడ పవిత్రమైన సన్యాసులు కూడా ఉన్నారు, అలాగే అపవిత్రమైన గృహస్థులు కూడా ఉన్నారు. కనుక పవిత్రుల మహిమ గాయనము చేయబడుతుంది. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజలు ఉంటారు. పవిత్రులు, అపవిత్రులు అని చెప్పేందుకు అక్కడ వేరే ఏ ధర్మమూ ఉండదు. ఇక్కడైతే కొందరు గృహస్థుల మహిమను కూడా గానము చేస్తూ ఉంటారు. వాళ్ళకు వారే ఖుదా, అల్లా వంటివారు. కానీ అల్లాను పతితపావనుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు. అందరూ పతితపావనులెలా అవ్వగలరు! ప్రపంచంలో ఎంత గాఢాంధకారముంది! ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. కనుక మేము చదువుకుని స్వయాన్ని రాజులుగా తయారుచేసుకోవాలి అనే చింత ఉండాలి. ఎవరైతే బాగా పురుషార్థము చేస్తారో, వారే రాజ్యతిలకాన్ని పొందుతారు. మేము కూడా ఈ లక్ష్మీనారాయణుల వలె అవ్వాలి అని పిల్లల్లో ఉల్లాసముండాలి. ఇందులో తికమకపడే అవసరము లేదు. పురుషార్థము చేయాలి. నిరాశపడకూడదు. ఈ చదువు ఎటువంటిదంటే, దీనిని మంచముపై పడుకుని కూడా చదువుకోవచ్చు. విదేశాలలో ఉంటూ కూడా చదువుకోవచ్చు. ఇంట్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు. ఇది అంత సహజమైన చదువు. బాగా కష్టపడి మీ పాపాలను తొలగించుకోవాలి మరియు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఇతర ధర్మాలవారికి కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఎవరికైనా, నీవు ఒక ఆత్మవు అని తెలియజేయాలి. ఆత్మ స్వధర్మము ఒక్కటే. ఇందులో ఎటువంటి తేడా ఉండదు. శరీరం నుండే అనేక ధర్మాలు వెలువడుతాయి. ఆత్మ అయితే ఒక్కటే. అందరూ ఒకే తండ్రి పిల్లలు. ఆత్మలను బాబా దత్తత తీసుకున్నారు. అందుకే బ్రహ్మా ముఖవంశావళి అని మహిమ చేస్తారు.

ఆత్మకు తండ్రి ఎవరు అన్నది ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు నింపించే ఫారంలో చాలా అర్థముంది. తండ్రి అయితే తప్పకుండా ఉన్నారు కదా. వారిని స్మృతి కూడా చేస్తారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఈ రోజుల్లో భారతదేశంలో ఎవ్వరినైనా కూడా ఫాదర్ అని అనేస్తున్నారు. మేయర్ను కూడా ఫాదర్ అని అంటారు. కానీ ఆత్మకు తండ్రి ఎవరు అన్నది తెలుసుకోరు. నీవే తల్లివి-తండ్రివి…. అని మహిమ కూడా చేస్తారు. కానీ వారు ఎవరో, ఎలా ఉంటారో ఏమీ తెలియదు. భారతదేశములోనే నీవే తల్లివి-తండ్రివి అని పిలుస్తారు. తండ్రియే ఇక్కడకు వచ్చి ముఖవంశావళిని రచిస్తారు. భారతదేశమునే మాతృదేశము అని అంటారు. ఎందుకంటే ఇక్కడే శివబాబా మాతా పితల రూపములో పాత్రను అభినయిస్తారు. ఇక్కడే భగవంతుడిని మాతా పితల రూపములో స్మృతి చేస్తారు. విదేశాలలో కేవలం గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. కానీ పిల్లలను దత్తత తీసుకునేందుకు తల్లి కూడా తప్పకుండా కావాలి కదా! పురుషుడు కూడా స్త్రీని దత్తత తీసుకుంటారు, ఆ తర్వాత వారి ద్వారా పిల్లలు జన్మిస్తారు. రచనను రచించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇతనిలో తండ్రి అయిన పరమపిత పరమాత్మ ప్రవేశించి దత్తత తీసుకుంటారు, పిల్లలు జన్మిస్తారు, అందుకే వీరిని మాతా-పిత అని అంటారు. వారు ఆత్మలకు తండ్రి, వారు ఇక్కడకు వచ్చి ఉత్పత్తిని చేస్తారు. ఇక్కడ మీరు పిల్లలుగా అవుతారు కనుక ఫాదర్, మదర్ అని అంటారు. అది మధురమైన ఇల్లు, అక్కడ ఆత్మలందరూ ఉంటారు. అక్కడకు బాబా తప్ప ఇంకెవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఎవరైనా కలిస్తే మీరు మధురమైన ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారా అని అడగండి. అలా అయితే తప్పకుండా పావనంగా అవ్వవలసి ఉంటుందని చెప్పండి. ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు. ఇది ఇనుపయుగమైన తమోప్రధాన ప్రపంచము. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇనుపయుగ ఆత్మలు తిరిగి ఇంటికి వెళ్ళలేవు. ఆత్మలు మధురమైన ఇంటిలో పవిత్రంగా ఉంటాయి. కనుక స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏ దేహధారిని స్మృతి చేయకండి. బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనంగా అవుతారు, మళ్ళీ నంబరువారుగా ఉన్నతపదవిని పొందుతారు. లక్ష్మీనారాయణుల చిత్రము చూపించి ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. భారతదేశంలో వీరి రాజ్యముండేది. వీరు రాజ్యము చేసేటప్పుడు విశ్వములో శాంతి ఉండేది. విశ్వములో శాంతిని తండ్రి మాత్రమే స్థాపించగలరు, ఇంకెవ్వరికీ ఆ శక్తి లేదు. ఇప్పుడు తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, నూతన ప్రపంచములో రాజాధి రాజులుగా ఎలా అవ్వగలరో తెలియజేస్తున్నారు. బాబాయే జ్ఞానసాగరులు. కానీ వారిలో ఎటువంటి జ్ఞానముందో ఎవ్వరికీ తెలియదు. సృష్టి ఆదిమధ్యాంతాల చరిత్ర-భూగోళాలు గురించి అనంతమైన తండ్రి మాత్రమే వినిపిస్తారు. మనుష్యులు అప్పుడప్పుడు సర్వవ్యాపి అని అంటారు లేక అందరి లోపల ఏముందో, అది తెలిసినవాడని అంటారు. స్వయాన్ని అయితే ఇలా చెప్పుకోలేరు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. వీటిని బాగా ధారణ చేసి హర్షితంగా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని సదా హర్షిత ముఖంగా తయారుచేస్తారు. స్కూలులో కూడా ఉన్నతమైన పదవి కోసం చదివేవారు ఎంత హర్షితంగా ఉంటారు. వీరు చాలా పెద్ద పరీక్షను పాస్ అవుతున్నారని ఇతరులు కూడా అర్థము చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన చదువు. ఇందులో ఫీజు మొదలైనవాటి విషయం లేదు. కేవలం ధైర్యము కావాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇందులోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. పవిత్రులుగా కండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రితో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ ముఖము నల్లగా చేసుకుంటారు అనగా వికారాలకు వశమౌతారు. ఇది చాలా శక్తివంతమైన మాయ. ఫెయిల్ అయ్యారంటే ఇక వారి పేరు మహిమ చేయబడదు. ఫలానా-ఫలానా వారు ప్రారంభము నుండి చాలా బాగా నడుస్తున్నారు అని మహిమ గాయనము చేయబడుతుంది. మీ కోసం మీరే పురుషార్థము చేసి రాజధానిని ప్రాప్తి చేసుకోవాలని తండ్రి చెప్తున్నారు. చదువు ద్వారా ఉన్నతపదవిని పొందాలి. ఇది రాజయోగము, ప్రజాయోగము కాదు. కానీ ప్రజలు కూడా తయారవుతారు కదా. ముఖము మరియు సేవ ద్వారా వారు ఎలా అయ్యేందుకు యోగ్యులో తెలిసిపోతుంది. ఇంట్లో విద్యార్థుల నడవడిక ద్వారా వీరు మొదటి నెంబరులో వస్తారు, వీరు మూడవ నంబరులో వస్తారు అని అర్థం చేసుకుంటారు కదా. ఇక్కడ కూడా అంతే. చివరిలో పరీక్షలు పూర్తి అయినప్పుడు మీకు అంతా సాక్షాత్కారమవుతుంది. సాక్షాత్కారమవ్వడంలో పెద్ద సమయమేమీ పట్టదు. ఆ తర్వాత మేము ఫెయిల్ అయిపోయాము అని ఎంతో సిగ్గుపడతారు. అలా ఫెయిల్ అయిపోయేవారిని ఎవరు ప్రేమిస్తారు?

మనుష్యులు సినిమాలు చూడటంలో ఎంతో సంతోషాన్ని అనుభవిస్తారు కానీ నంబరువన్ అశుద్ధంగా తయారుచేసేవి ఈ సినిమాలే అని తండ్రి చెప్తారు. వాటిని చూసేవారు చాలా వరకు ఫెయిల్ అయి పడిపోతారు. కొంతమంది స్త్రీలు కూడా ఏవిధంగా ఉన్నారంటే, వారికి సినిమాలకు వెళ్ళకపోతే నిద్రపట్టదు. ఇలా సినిమాలు చూసేవారు అపవిత్రంగా అయ్యేందుకు తప్పకుండా పురుషార్థము చేస్తారు. ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉందో, అందులో మనుష్యులు సంతోషము ఉందని అనుకుంటున్నారు కానీ అదంతా దుఃఖము కొరకే. ఇవన్నీ వినాశీ సంతోషాలు. అవినాశీ సంతోషం అవినాశీ తండ్రి ద్వారానే లభిస్తుంది. బాబా మనల్ని ఈ లక్ష్మీనారాయణుల వలె తయారుచేస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు 21 జన్మల కోసం అని వ్రాసేవారు. కానీ ఇప్పుడైతే బాబా 50-60 జన్మల వరకు అని వ్రాస్తారు ఎందుకంటే ద్వాపరములో కూడా మొదట ఎంతో ధనవంతులుగా, సుఖంగా ఉంటారు కదా. పతితులుగా అవుతారు కానీ ధనమైతే ఎంతో ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధానంగా అయిపోతారో, అప్పుడు దుఃఖము మొదలవుతుంది. మొదట సుఖంగానే ఉంటారు. ఎప్పుడైతే చాలా దుఃఖితులుగా అవుతారో, అప్పుడు తండ్రి వస్తారు. మహాఅజామిళుని వంటి పాపులను కూడా ఉద్ధరిస్తారు. నేను అందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను, అంతేకాక సత్యయుగ రాజ్యమును కూడా మీకు ఇస్తానని తండ్రి చెప్తారు. అందరి కళ్యాణము జరుగుతుంది కదా. శాంతిధామానికి గానీ, సుఖధామానికి గానీ అందరినీ తమ-తమ గమ్యాలకు చేర్చుతారు. సత్యయుగంలో అందరికీ సుఖముంటుంది. శాంతిధామంలో కూడా సుఖంగా ఉంటారు. విశ్వంలో శాంతి ఏర్పడాలని కోరుకుంటారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు విశ్వములో శాంతి ఉండేది కదా, అక్కడ దుఃఖమనే మాటే ఉండదు, దుఃఖము కానీ, అశాంతి కానీ ఉండదని చెప్పండి. ఇక్కడైతే ఇంటింటిలోనూ అశాంతియే ఉంది. అన్ని దేశాలలోనూ అశాంతియే ఉంది. పూర్తి విశ్వములో అశాంతి ఉంది. ఎన్ని ముక్కలు ముక్కలుగా అయిపోయింది! ఎన్ని విభజనలు! వంద మైళ్ళకు ఒక భాష ఉంటుంది. సంస్కృతము భారతదేశం యొక్క ప్రాచీన భాష అని అంటారు. ఇప్పుడు ఆది సనాతన ధర్మము గురించే ఎవ్వరికీ తెలియనప్పుడు, ఇది ప్రాచీన భాష అని ఎలా చెప్పగలరు. ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ఎప్పుడుండేదో మీరు చెప్పగలరు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరు మంద బుద్ధికలవారు కూడా ఉన్నారు. వీరు రాతి బుద్ధి కలవారని చూస్తూనే అర్థమైపోతుంది. ఓ భగవంతుడా! వీరి బుద్ధి తాళమును తెరవండని అజ్ఞాన కాలంలో కూడా అంటారు కదా.

పిల్లలైన మీ అందరికీ బాబా జ్ఞాన ప్రకాశాన్నిస్తారు, దాని ద్వారా తాళము తెరుచుకుంటూ ఉంటుంది. అయినా కొందరి బుద్ది తెరుచుకోదు. “బాబా, మీరు బుద్ధిమంతులకే బుద్ధిమంతులు కదా, మా పతి బుద్ధి యొక్క తాళము తెరవండి” అని అంటారు. నేను ఒక్కొక్కరి బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరిచేందుకు రాలేదు అని బాబా చెప్తారు. అలా అయితే అందరి బుద్ధి తెరుచుకుంటుంది, అందరూ మహారాజా-మహారాణులుగా అవుతారు. అందిరి తాళాన్ని నేనెలా తెరుస్తాను. వారు సత్యయుగములో వచ్చేదే లేనప్పుడు నేనెలా తాళం తెరవగలను! డ్రామానుసారముగా సమయానికే వారి బుద్ధి తెరుచుకుంటుంది. నేనెలా తెరుస్తాను! డ్రామాపై కూడా ఆధారపడి ఉంది కదా. అందరూ ఫుల్ పాస్ అవ్వరు కదా. స్కూల్లో కూడా నంబరువారుగా ఉంటారు. ఇది కూడా చదువే. ప్రజలు కూడా తయారవ్వాలి. అందరి తాళము తెరుచుకున్నట్లయితే ప్రజలు ఎక్కడ నుండి వస్తారు? ఈ నియమమే లేదు. పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి. ప్రతి ఒక్కరి పురుషార్థము ద్వారా తెలుస్తుంది, ఎవరైతే బాగా చదువుకుంటారో, వారిని అన్ని స్థానాలకు పిలుస్తూ ఉంటారు. ఎవరెవరు బాగా సేవ చేస్తున్నారో బాబాకు తెలుసు. పిల్లలు బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటే ఇంటికి తీసుకువెళ్తాను, తర్వాత స్వర్గములోకి పంపిస్తాను. లేకపోతే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. విద్యార్థులు టీచరును ప్రత్యక్షము చేయాలి. స్వర్ణిమయుగంలో పారసబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు ఇనుప యుగము కనుక ఇక్కడ స్వర్ణిమయుగ బుద్ధి ఎలా ఉంటుంది? ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉన్నప్పుడు విశ్వములో శాంతి ఉండేది. భారతదేశములో వీరి రాజ్యమున్నప్పుడు విశ్వములో శాంతి ఉండేదని మీరు వార్తాపత్రికల్లో కూడా వేయవచ్చు. అఖరికి తప్పకుండా అర్థము చేసుకుంటారు. పిల్లలైన మీ పేరు ప్రసిద్ధమవ్వాలి. ఆ చదువులో అనేక పుస్తకాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడ అటువంటిదేమీ లేదు. చదువు చాలా సులభము. అయితే స్మృతిలో మంచి మంచి మహారథులు కూడా ఫెయిల్ అవుతారు. స్మృతి పదును లేకపోతే జ్ఞాన ఖడ్గము నడవదు. చాలా స్మృతి చేస్తే పదును వస్తుంది. బంధనములో ఉన్నా కూడా స్మృతి చేస్తూ ఉంటే చాలా లాభముంటుంది. కొందరు బాబాను ఎప్పుడూ చూసి కూడా ఉండరు, కానీ స్మృతిలోనే ప్రాణాలు వదిలేస్తారు. వారు చాలా మంచి పదవిని పొందగలరు. ఎందుకంటే చాలా స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ప్రేమపూరితమైన అశ్రువులు వచ్చేస్తాయి, ఆ అశ్రువులు ముత్యాలుగా అయిపోతాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయానికి స్వయమే పురుషార్థము చేసి ఉన్నతపదవిని పొందాలి. చదువు ద్వారా స్వయానికి స్వయమే రాజ్యతిలకమును దిద్దుకోవాలి. జ్ఞానము బాగా ధారణ చేసి సదా హర్షితంగా ఉండాలి.

2. జ్ఞాన ఖడ్గములో స్మృతి అనే పదును నింపాలి, స్మృతి ద్వారానే బంధనాలను తెంచాలి, ఎప్పుడూ చెడు సినిమాలు చూసి మీ సంకల్పాలను అపవిత్రంగా చేసుకోకూడదు.

వరదానము:- సదా ఏకాంతము మరియు స్మరణలో బిజీగా ఉండే అనంతమైన వానప్రస్థీ భవ

వర్తమాన సమాయనుసారముగా మీరందరూ వానప్రస్థ అవస్థకు సమీపంగా ఉన్నారు. వానప్రస్థులు ఎప్పుడూ బొమ్మలతో ఆడుకోరు. వారు సదా ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు. అనంతమైన వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంత్యంలో అనగా నిరంతర ఏకాంతంలో ఉంటూ, దానితో పాటు ఒక్కరి స్మరణను చేస్తూ స్మృతిస్వరూపులుగా అవ్వండి. పిల్లలందరి పట్ల బాప్ దాదాకు ఇదే శుభ ఆశ ఉంది – ఇప్పుడు తండ్రి మరియు పిల్లలు సమానంగా అవ్వాలి. సదా స్మృతిలో ఇమిడి ఉండాలి. సమానంగా అవ్వడమే ఇమిడిపోవడం – ఇదే వానప్రస్థ స్థితికి గుర్తు.

స్లోగన్:- మీరు ధైర్యంతో ఒక్క అడుగు వేస్తే, బాబా సహాయమనే వేలాది అడుగులను వేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *