Telugu Murli 15/07/20

15-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – మీరు సత్యాతి-సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి, సత్యమైన వైష్ణవులు భోజన పథ్యముతో పాటు పవిత్రంగా కూడా ఉంటారు”

ప్రశ్న:- ఏ అవగుణము, గుణముగా మారినప్పుడు నావ తీరాన్ని చేరగలుగుతుంది?

జవాబు:- అన్నింటికంటే పెద్ద అవగుణము మోహము. మోహము వలన సంబంధీకుల స్మృతి విసిగిస్తూ ఉంటుంది (కోతి ఉదాహరణ). ఎవరి సంబంధీకులైనా మరణిస్తే, 12 నెలల వరకు వారినే తలచుకుంటూ ఉంటారు. చేతులతో ముఖాన్ని కప్పుకుని ఏడుస్తూ ఉంటారు, వారి స్మృతి వస్తూనే ఉంటుంది. ఒకవేళ బాబా స్మృతి ఈ విధంగా సతాయిస్తే, రాత్రింబవళ్ళు మీరు తండ్రిని స్మృతి చేస్తే, మీ నావ తీరానికి చేరిపోతుంది. ఏ విధంగా లౌకిక సంబంధీకులను స్మృతి చేస్తారో, అలా తండ్రిని స్మృతి చేసినట్లయితే అది అహో సౌభాగ్యము!

ఓంశాంతి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చోండి అని బాబా ప్రతి రోజూ పిల్లలకు అర్థం చేయిస్తారు. నేడు దానికి కొద్దిగా చేరుస్తున్నారు – కేవలం తండ్రిగానే భావించడం కాదు, ఇంకొక విధంగా కూడా భావించాలి. పరమపిత పరమాత్మ శివుడిని గాడ్ ఫాదర్ అని కూడా అంటారు, ఇదే ముఖ్యమైన విషయము. వారు జ్ఞానసాగరులు కూడా. జ్ఞాన సాగరులైన కారణంగా వారు టీచరు కూడా, వారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ విషయాలు అర్థము చేయిస్తే సత్యమైన తండ్రి వీరిని చదివిస్తున్నారని, వీరు ప్రాక్టికల్ విషయాలను వినిపిస్తున్నారని అనుకుంటారు. వారు సర్వుల తండ్రి, టీచర్, సద్గతిదాత కూడా, మరియు వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. వారు తండ్రి, టీచర్, పతితపావనులు, జ్ఞానసాగరులు. మొట్టమొదట తండ్రిని మహిమ చేయాలి. వారు మనల్ని చదివిస్తున్నారు. మనము బ్రహ్మాకుమార-కుమారీలము. బ్రహ్మా కూడా శివబాబా రచనయే. ఇప్పుడిది సంగమయుగము. ఇక్కడ ముఖ్య లక్ష్యము కూడా రాజయోగమే, మనకు రాజయోగము నేర్పిస్తున్నారు కావున టీచర్ గా కూడా అయ్యారు. మరియు ఈ చదువు కొత్త ప్రపంచము కోసం ఉన్నది. మేము ఇతరులకు ఏయే విషయాలను అర్థం చేయించాలి అన్నది ఇక్కడ కూర్చుని పక్కా చేసుకోండి. ఈ విషయాలు మీ లోపల ధారణ అవ్వాలి. కొందరికి ఎక్కువ ధారణ అవుతుంది, కొందరికి తక్కువ ధారణ అవుతుందని మీకు తెలుసు. ఇక్కడ కూడా ఎవరైతే జ్ఞానములో బాగా చురుకుగా ముందుకు వెళ్తారో, వారి పేరు ప్రసిద్ధమౌతుంది. వారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది. పథ్యమును కూడా బాబా తెలియజేస్తూ ఉంటారు. మీరు సంపూర్ణ వైష్ణవులుగా అవుతారు. వైష్ణవులంటే శాఖాహారులు, మాంసము, మద్యము మొదలైనవి తీసుకోరు. కానీ వికారాలలోకి వెళ్తారు. మరి వైష్ణవులుగా అయి లాభమేముంది? వైష్ణవ కులానికి చెందినవారు అనగా ఉల్లిపాయలు మొదలైన తమోప్రధాన వస్తువులను తినేవారు కాదు. తమోప్రధాన వస్తువులంటే ఏమేమి ఉంటాయో పిల్లలైన మీకు తెలుసు. కొందరు మంచి మనుష్యులు కూడా ఉంటారు, వారిని ధార్మిక మనస్కులు లేక భక్తులు అని అంటారు. సన్యాసులను పవిత్రాత్మలని అంటారు. దానం మొదలైనవి చేసేవారిని పుణ్యాత్మలని అంటారు. దీని ద్వారా కూడా ఆత్మనే దాన-పుణ్యాలు చేస్తుందని ఋజువు అవుతుంది, అందుకే పుణ్యాత్మ, పవిత్రాత్మ అని అంటారు. ఆత్మ నిర్లేపి కాదు. ఇటువంటి మంచి మంచి పదాలను గుర్తు చేసుకోవాలి. సాధువులను కూడా మహాన్ ఆత్మ అని అంటారు, మహాన్ పరమాత్మ అని అనరు. కావున సర్వవ్యాపి అని అనడం తప్పు. అందరూ ఆత్మలే. ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో, అందరిలో ఆత్మ ఉంది. విద్యావంతులు వృక్షాలలో కూడా ఆత్మ ఉంటుందని ఋజువు చేసి చెప్తారు. 84 లక్షల జీవరాసులలో కూడా ఆత్మ ఉందని అంటారు. ఆత్మ లేకపోతే వృద్ధి ఎలా జరుగుతుంది అని అంటారు. మనుష్య ఆత్మ ఏ జడ పదార్థములోకి వెళ్ళదు. శాస్త్రాలలో ఇటువంటి విషయాలు వ్రాసేశారు. ఇంద్రప్రస్థము నుండి క్రిందికి తోయగానే రాయిగా అయిపోయారని వ్రాశారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు – “దేహం యొక్క సంబంధాలను తెంచి స్వయాన్ని ఆత్మగా భావించండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇక మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి.” దుఃఖధాము అపవిత్ర ధామము. శాంతిధామము, సుఖధామాము పవిత్ర ధామాలు. ఇది అర్థము చేసుకుంటారు కదా. సుఖధామంలో ఉండేటటువంటి దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు. దీనిబట్టి భారతదేశములో, కొత్త ప్రపంచములో పవిత్రాత్మలు ఉండేవారని, ఉన్నతమైన పదవి కలవారు ఉండేవారని ఋజువు అవుతుంది. నిర్గుణుడినైన నాలో ఏ గుణాలు లేవు అని ఇప్పుడు పాడుతారు. వాస్తవానికి అలాగే ఉన్నారు. ఏ గుణమూ లేదు. మనుష్యులలో మోహము కూడా చాలా ఉంటుంది, మరణించినవారు కూడా గుర్తుంటారు. వీరు నా పిల్లలని బుద్ధిలోకి వస్తుంది. పతి లేక పిల్లలు మరణిస్తే వారినే గుర్తు చేసుకుంటూ ఉంటారు. పత్ని 12 నెలలు వరకు బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముఖము కప్పుకుని ఏడుస్తూనే ఉంటారు. ఇలాగే ముఖము కప్పుకుని రాత్రింబవళ్లు మీరు తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుకుంటుంది. తండ్రి చెప్తున్నారు – మీరు ఎలా అయితే పతిని గుర్తు చేసుకుంటూ ఉంటారో అలా నన్ను గుర్తు చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇలా ఇలా చేయండని తండ్రి యుక్తులు తెలియజేస్తూ ఉంటారు.

ఈరోజు ఇంత ఖర్చయింది, ఇంత లాభము వచ్చింది, ఇంత మిగిలింది అని ప్రతి రోజూ లెక్కను చూసుకుంటూ ఉంటారు. కొందరు నెల-నెలా చూస్తారు. ఈ లెక్క చూడడం ఇక్కడ చాలా అవసరం, బాబా పదే పదే అర్థం చేయిస్తుంటారు. తండ్రి చెప్తున్నారు – పిల్లలైన మీరు సౌభాగ్యశాలురు, వేయి రెట్ల భాగ్యశాలురు, కోటి రెట్ల భాగ్యశాలురు, పదమ, అరబ్, కరబ్ (కోటాను కోట్ల) రెట్ల భాగ్యశాలురు. ఏ పిల్లలైతే తమను తాము సౌభాగ్యశాలురమని భావిస్తారో, వారు తప్పకుండా తండ్రిని బాగా స్మృతి చేస్తూ ఉంటారు. వారే గులాబీ పుష్పాలుగా తయారౌతారు. ఇది సారంలో అర్థం చేయించాలి. సుగంధభరిత పుష్పముగానే అవ్వాలి. ముఖ్యమైనది స్మృతి. సన్యాసులు యోగము అన్న పదాన్ని ఉపయోగించారు. లౌకిక తండ్రి తనను స్మృతి చేయమని చెప్పడము గానీ నన్ను గర్తు చేస్తున్నారా అని అడగడం గానీ చేయరు. తండ్రికి పిల్లలు, పిల్లలకు తండ్రి తప్పకుండా గుర్తు ఉంటారు, ఇది నియమము. ఇక్కడ మాయ మరిపింపజేస్తుంది కావున అడగవలసి వస్తుంది. ఇక్కడకు వస్తారు, మేము తండ్రి వద్దకు వెళ్తున్నామని భావిస్తారు కనుక తండ్రి స్మృతి ఉండాలి. అందుకే బాబా చిత్రాలు కూడా తయారు చేయిస్తారు కనుక అవి కూడా మీతోపాటు ఉండాలి. మొట్టమొదట ఎల్లప్పుడూ తండ్రి మహిమతోనే ప్రారంభం చేయండి. వీరు మా బాబా, వాస్తవానికి వారు సర్వులకు తండ్రి. సర్వుల సద్గతిదాత, జ్ఞానసాగరులు, నాలెడ్జ్ ఫుల్. బాబా మాకు సృష్టి చక్ర ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు, దీని ద్వారా మేము త్రికాలదర్శులుగా అవుతాము. ఈ సృష్టిపై త్రికాలదర్శి మనుష్యులెవ్వరూ ఉండరు. ఈ లక్ష్మీనారాయణులు కూడా త్రికాలదర్శులు కారు అని తండ్రి చెప్తున్నారు. వీరు త్రికాలదర్శులుగా అయి ఏం చేస్తారు! మీరు త్రికాలదర్శులుగా అవుతారు మరియు ఇతరులను అలా తయారుచేస్తారు. ఈ లక్ష్మీనారాయణులులో జ్ఞానము ఉన్నట్లయితే అది పరంపరగా కొనసాగేది. మధ్యలో వినాశనమైపోతుంది కనుక పరంపరగా కొనసాగదు. కావున పిల్లలు ఈ చదువును బాగా స్మరణ చేయాలి. మీ ఉన్నతాతి ఉన్నతమైన చదువు కూడా సంగమయుగములోనే జరుగుతుంది. మీరు స్మృతి చేయకుండా దేహాభిమానములోకి వస్తే మాయ చెంపదెబ్బ వేస్తుంది. 16 కళా సంపూర్ణులుగా అయినప్పుడు వినాశనానికి కూడా ఏర్పాట్లు జరుగుతాయి. వారు వినాశనము కొరకు, మీరు అవినాశీ పదవి కొరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కౌరవులు మరియు పాండవుల మధ్యన యుద్ధము జరగలేదు, కౌరవులు మరియు యాదవుల యుద్ధము జరుగుతుంది. డ్రామానుసారముగా పాకిస్తాన్ కూడా తయారైంది. అది కూడా మీ జన్మ జరిగినప్పుడే ప్రారంభమయింది. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక అంతా ప్రాక్టికల్ గా జరగాలి కదా. ఇక్కడి గురించే రక్తపు నదులు ప్రవహిస్తాయని చెప్తారు, తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు కూడా చూడండి కొట్లాడుకుంటూ ఉంటారు. “ఫలానా నగరాన్ని మాకు ఇవ్వకపోతే యుద్ధము చేస్తాము”, “ఈ మార్గము ద్వారా వెళ్ళకండి, ఇది మా మార్గము” అని అంటూ ఉంటారు. ఇప్పుడు వారేం చేయాలి? స్టీమర్లు ఎలా ప్రయాణించాలి? అప్పుడు పరస్పరములో చర్చించుకుంటారు, సలహాలను తీసుకుంటారు. తప్పకుండా సహాయం లభిస్తుంది అన్న విశ్వాసము కలుగుతుంది, అప్పుడు వారు పరస్పరములోనే సమస్యను పరిష్కరించుకుంటారు. ఇక్కడైతే డ్రామాలో గృహయుద్ధాలు రచింపబడి ఉన్నాయి.

ఇప్పుడు తండ్రి చెప్తున్నారు – మధురమైన పిల్లలూ, చాలా చాలా వివేకవంతులుగా అవ్వండి, ఇక్కడ నుండి బయటకు ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మర్చిపోకండి. ఇక్కడకు మీరు సంపాదనను జమ చేసుకునేందుకు వస్తారు. చిన్న చిన్న పిల్లలను తీసుకువస్తే వారి బంధనములో ఉండవలసి వస్తుంది. ఇక్కడ జ్ఞానసాగరుని తీరములోకి వస్తారు, ఎంత సంపాదన చేసుకుంటే, అంత మంచిది. ఇందులో నిమగ్నమైపోవాలి. మీరు అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకునేందుకే వస్తారు. ఓ భోళానాథ! జోలెను నింపు… అని పాడుతారు కదా. భక్తులు శంకరుని ఎదురుగా వెళ్ళి జోలెను నింపమని వేడుకుంటారు. వారు శివ-శంకరులు ఒక్కరే అని భావిస్తారు. శివ-శంకర మహాదేవ అని అంటారు. అటువంటప్పుడు మహాదేవుడు పెద్దవారైపోతారు కదా. ఇటువంటి చిన్న-చిన్న విషయాలను చాలా అర్థము చేసుకోవాలి.

మీరిప్పుడు బ్రాహ్మణులు, మీకు జ్ఞానము లభిస్తూ ఉంది అని పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయించబడుతుంది. చదువు ద్వారా మనుష్యులు సంస్కరింపబడతారు. నడవడిక కూడా బాగు అవుతుంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఎవరైతే అందరికంటే ఎక్కువగా చదువుకుంటారో మరియు చదివిస్తారో, వారి మేనర్స్ కూడా బాగుంటాయి. మమ్మా-బాబా యొక్క మేనర్స్ అందరికంటే బాగుంటాయని మీరంటారు. ఇతను (బ్రహ్మా) పెద్ద తల్లి వంటివారు, ఇతనిలో ప్రవేశించి పిల్లలను రచిస్తారు. వీరిలో మాత-పితలు కంబైండ్ గా ఉన్నారు. ఇవి ఎంత గుప్తమైన విషయాలు. మీరు ఎలా అయితే చదువుకుంటున్నారో, అలా మమ్మా కూడా చదువుకునేవారు. వారిని దత్తత చేసుకున్నారు. వారు తెలివైనవారు కనుక డ్రామానుసారముగా సరస్వతి అనే పేరు వచ్చింది. బ్రహ్మపుత్ర చాలా పెద్ద నది. సాగరము మరియు బ్రహ్మపుత్ర యొక్క మేళా కూడా జరుగుతుంది. ఇతను పెద్ద నది మరియు తల్లి కూడా. మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని ఎంత ఉన్నతిలోకి తీసుకువెళ్తారు! తండ్రి పిల్లలైన మిమ్మల్నే చూస్తారు. వారు ఎవ్వరినీ స్మృతి చెయ్యవలసిన అవసరము లేదు. ఇతని ఆత్మ (బ్రహ్మా) అయితే తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తున్నారు – మేమిరువురము పిల్లలను చూస్తాము. ఆత్మనైన నేను (బ్రహ్మా) సాక్షిగా అయి చూడను కానీ తండ్రి సాంగత్యంలో నేను కూడా అలాగే సాక్షిగా చూస్తాను. నేను తండ్రితోపాటు ఉంటాను కదా. వారి బిడ్డను కనుక నేను వారితోపాటు చూస్తాను. నేను విశ్వానికి యజమానిగా అయి తీరుతాను, ఇదంతా నేనే చేసినట్లుంటుంది. నేను దృష్టి ఇస్తాను. దేహ సహితంగా అంతా మర్చిపోవలసి ఉంటుంది. తండ్రి కొడుకులు ఒక్కటైపోయినట్లు కనిపిస్తారు. బాగా పురుషార్థము చేయండని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. తప్పకుండా మమ్మా-బాబాలు అందరికంటే ఎక్కువ సేవ చేస్తారు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు చాలా సేవ చేస్తారు కదా. సేవ చేసేవారు తప్పకుండా ఉన్నతమైన పదవిని పొందుతారు కావున వారిని ఫాలో చేయాలి కదా. ఎలా అయితే తండ్రి అపకారులకు కూడా ఉపకారము చేస్తారో, అలా మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి. దీని అర్థము కూడా తెలుసుకోవాలి. తండ్రి చెప్తున్నారు – నన్ను స్మృతి చేయండి, ఇతరులెవ్వరి మాటలు వినకండి. ఎవరైనా, ఏదైనా అంటే, అది వినీ విననట్లుగా వదిలేయండి. మీరు నవ్వుతూ ఉన్నట్లయితే వారంతట వారే చల్లబడిపోతారు. తండ్రి చెప్తున్నారు – ఎవరైనా కోపగించుకుంటే, మీరు వారిపై పుష్పాలు చల్లండి, మీరు అపకారము చేస్తారు, మేము ఉపకారము చేస్తాము అని వారికి చెప్పండి. తండ్రి స్వయంగా చెప్తున్నారు – ప్రపంచములోని మనుష్యులంతా నాకు అపకారము చేసినవారే, నన్ను సర్వవ్యాపి అని ఎంత నిందిస్తారు. కానీ నేను అందరికీ ఉపకారిని. పిల్లలైన మీరు కూడా అందరికీ ఉపకారము చేసేవారు. మీరు ఆలోచించండి – ఎలా ఉన్న నేను, ఇప్పుడు ఎలా అవుతున్నాను! విశ్వానికి యజమానిగా అవుతున్నాను. సంకల్పము-స్వప్నములో కూడా అనుకోలేదు. చాలామందికి ఇంట్లో కూర్చునే సాక్షాత్కారము జరిగింది కానీ సాక్షాత్కారము ద్వారా ఏ లాభమూ లేదు. నెమ్మది-నెమ్మదిగా వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ కొత్త దైవీ వృక్షము స్థాపించబడుతూ ఉంది కదా. మా దైవీ పుష్పాల తోట తయారవుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. సత్యయుగములో దేవతలే ఉంటారు, మళ్ళీ వారే రావాలి, చక్రము తిరుగుతూనే ఉంటుంది. 84 జన్మలు కూడా వారే తీసుకుంటారు. ఇతర ఆత్మలు మరి ఎక్కడ నుండి వస్తాయి. డ్రామాలో ఉన్న ఆత్మలెవ్వరూ వారి పాత్ర నుండి విడుదల అవ్వలేరు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ అరిగిపోదు. చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు.

తండ్రి కూర్చుని మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు – పిల్లలూ, సుఖమునిచ్చేవారిగా అవ్వండి. పరస్పరము కొట్లాడుకోకండి అని తల్లి చెప్తుంది కదా. అనంతమైన తండ్రి కూడా పిల్లలకు చెప్తున్నారు – స్మృతియాత్ర చాలా సులభము. ఆ యాత్రలు జన్మ-జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు కానీ మెట్లు క్రిందకు దిగుతూ పాపాత్మలుగానే అవుతూ వచ్చారు. ఇది ఆత్మిక యాత్ర అని తండ్రి చెప్తున్నారు. మీరు ఈ మృత్యు లోకములోకి తిరిగి రాకూడదు. ఆ యాత్రల నుండైతే తిరిగి వచ్చి మళ్ళీ యథాతథంగా అయిపోతారు. మనము స్వర్గములోకి వెళ్తామని మీకు తెలుసు. స్వర్గము ఒకప్పుడు ఉండేది, మళ్ళీ ఉంటుంది. ఈ చక్రము తిరగాలి. ప్రపంచము ఒక్కటే, ఇకపోతే నక్షత్రాలు మొదలైనవాటిలో ఏ ప్రపంచమూ లేదు. పైకి వెళ్ళి చూసేందుకు ఎంతగా తల బాదుకుంటూ ఉంటారు. తల బాదుకుంటూ – బాదుకుంటూ మృత్యువు ఎదురుగా వచ్చేస్తుంది. ఇదంతా విజ్ఞానము. పైకి వెళ్తారు, ఆ తర్వాత ఏమి జరుగుతుంది? మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. ఒకవైపు పైకి వెళ్ళి పరిశోధిస్తూ ఉంటారు, మరోవైపు మృత్యువు కొరకు బాంబులు తయారుచేస్తున్నారు. మనుష్యుల బుద్ధి ఎలా ఉందో చూడండి! ఎవరో ప్రేరేపిస్తున్నారని కూడా భావిస్తారు. ప్రపంచ యుద్ధము తప్పకుండా జరగనున్నదని వారు స్వయమే అంటారు. ఇది అదే మహాభారత యుద్ధము. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా, ఎంత పురుషార్థము చేస్తారో, అంత కళ్యాణము చేస్తారు. అందరూ ఖుదా పిల్లలే. భగవంతుడు తమ పిల్లలుగా చేసుకుంటే మీరు భగవాన్-భగవతీలుగా అవుతారు. లక్ష్మీనారాయణులను గాడ్, గాడెస్ అని అంటారు కదా. కృష్ణుడిని భగవంతునిగా భావిస్తారు కానీ రాధను అంతగా భావించరు. సరస్వతికి పేరుంది కానీ రాధకు అంత పేరు లేదు. కలశమును లక్ష్మికి చూపిస్తారు, ఇది కూడా ఒక పొరపాటే. సరస్వతికి కూడా అనేక పేర్లు పెట్టేశారు. అలా పెట్టింది మీరే. దేవీల పూజ కూడా జరుగుతుంది. అలాగే ఆత్మల పూజ కూడా జరుగుతుంది. బాబా పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తూ ఉంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎలా అయితే తండ్రి అపకారికి కూడా ఉపకారము చేస్తారో, అలా తండ్రిని అనుసరించాలి. ఎవరైనా, ఏదైనా అంటే, అది వినీ విననట్లుగా వదిలేయాలి, నవ్వుతూ ఉండాలి. ఒక్క తండ్రి నుండే వినాలి.

2. సుఖమునిచ్చే వారిగా అయి అందరికీ సుఖమును ఇవ్వాలి, పరస్పరములో కొట్లాడుకోకూడదు. వివేకవంతులుగా అయి మీ జోలెను అవినాశీ జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి.

వరదానము:- శుద్ధ సంకల్పాల వ్రతము ద్వారా వృత్తిని పరివర్తన చేసే హృదయ సింహాసనాధికారి భవ

బాప్ దాదాల హృదయ సింహాసనము ఎంత పవిత్రమైనదంటే, ఈ సింహాసనంపై సదా పవిత్రంగా ఉండే ఆత్మలు మాత్రమే కూర్చోగలరు. ఎవరి సంకల్పాలలోనైనా అపవిత్రత లేక అమర్యాద వచ్చిందంటే వారు హృదయ సింహాసనాధికారులుగా అయ్యేందుకు బదులుగా దిగే కళలో క్రిందకు వచ్చేస్తారు. కావున మొదట శుద్ధసంకల్పాల వ్రతము ద్వారా మీ వృత్తిని పరివర్తన చేసుకోండి. వృత్తి పరివర్తన ద్వారా భవిష్య జీవితమనే సృష్టి మారిపోతుంది. శుద్ధ సంకల్పాలు మరియు దృఢ సంకల్పాల వ్రతము యొక్క ప్రత్యక్ష ఫలము – సదా కాలానికి బాప్ దాదా హృదయ సింహాసనము.

స్లోగన్:- తనువు మరియు మనస్సును తాకట్టుగా భావించి నడుచుకున్నట్లయితే అనాసక్తులుగా ఉంటారు మరియు ఆత్మికత వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *