Telugu Murli 13/08/20

13-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – మిమ్మల్ని చదివించడానికి ఎవరు వచ్చారు అన్నది ఆలోచించినట్లయితే సంతోషంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి, ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి చదివిస్తున్నారు, ఇటువంటి చదువును ఎప్పుడూ విడిచిపెట్టకూడదు”

ప్రశ్న:- పిల్లలైన మీకిప్పుడు ఎటువంటి నిశ్చయము ఏర్పడింది? నిశ్చయబుద్ధి కలవారి గుర్తులేమిటి?

జవాబు:- ఇప్పుడు మేము ఎటువంటి చదువును చదువుతున్నామంటే, దీని ద్వారా డబల్ కిరీటధారులుగా, రాజులకే రాజులుగా అవుతామన్న నిశ్చయము మీకు ఏర్పడింది. స్వయంగా భగవంతుడు మమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు. ఇప్పుడు మేము వారి పిల్లలుగా అయ్యాము కనుక ఈ చదువులో నిమగ్నమైపోవాలి. ఎలాగైతే చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు తప్ప ఇంకెవ్వరి వద్దకు వెళ్ళరో, అదే విధంగా అనంతమైన తండ్రి లభించినప్పుడు ఇంకెవ్వరూ ఇష్టమనిపించకూడదు. ఒక్కరి స్మృతి మాత్రమే ఉండాలి.

గీతము:- ఈ రోజు ఉదయముదయమే ఎవరు వచ్చారు…. (కౌన్ ఆయా ఆజ్ సవేరే-సవేరే)

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు పాట విన్నారు – ఎవరు వచ్చారు మరియు ఎవరు చదివిస్తున్నారు? ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. కొందరు చాలా తెలివైనవారిగా ఉంటారు, కొందరు తక్కువ తెలివి కలిగి ఉంటారు. బాగా చదువుకున్నవారిని చాలా తెలివైనవారు అని అంటారు. శాస్త్రాలు మొదలైనవి చదివిన వారికి గౌరవముంటుంది. తక్కువ చదువుకున్నవారికి తక్కువ గౌరవము లభిస్తుంది. చదివించేందుకు ఎవరు వచ్చారు – అని ఇప్పుడు పాటలోని పదాలను విన్నారు. టీచరు వస్తారు కదా. పాఠశాలలో చదివేవారికి టీచరు వచ్చారని తెలుస్తుంది. ఇక్కడికి ఎవరు వచ్చారు? ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి మళ్ళీ చదివించేందుకు వచ్చారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా! అదృష్టకరమైన విషయము కూడా. చదివించేవారు ఎవరు? భగవంతుడు. వారు వచ్చి చదివిస్తున్నారు. ఎవరు ఎంత గొప్ప చదువును చదువుకున్నా కానీ, వెంటనే ఆ చదువును వదిలి భగవంతుని వద్దకు వచ్చి చదువుకోవాలి అని వివేకం చెప్తుంది. ఒక్క క్షణంలో అంతా వదిలి తండ్రి వద్దకు చదువుకునేందుకు రావాలి.

ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగవాసులుగా అయ్యారు అని బాబా అర్థం చేయించారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఉత్తమోత్తమ పురుషులు. వీరు ఏ చదువు ద్వారా ఈ పదవిని పొందారు అనేది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఈ పదవిని పొందేందుకు మీరు చదువుతున్నారు. ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడు. కనుక ఇతర చదువులన్నీ వదిలి ఈ చదువులో నిమగ్నమవ్వాలి ఎందుకంటే తండ్రి కల్పము తర్వాతనే వస్తారు. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత సన్ముఖంగా చదివించడానికి వస్తాను అని తండ్రి చెప్తున్నారు. అద్భుతము కదా. మాకు ఈ పదవిని ప్రాప్తింపజేసేందుకు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అని కూడా అంటారు. కానీ చదవరు. కావున వీరు తెలివైనవారు కారు అని తండ్రి అంటారు కదా. తండ్రి యొక్క చదువుపై పూర్తి ధ్యానం పెట్టరు. తండ్రిని మర్చిపోతారు. బాబా, మేము మర్చిపోతున్నామని మీరు అంటారు. టీచరును కూడా మర్చిపోతారు. ఇదే మాయా తుఫాను. కానీ చదువైతే చదువుకోవాలి కదా. భగవంతుడు చదివిస్తున్నారంటే ఈ చదువులో పూర్తిగా నిమగ్నమవ్వాలని వివేకము చెప్తుంది. చిన్న పిల్లలనే చదివించడం జరుగుతుంది. ఆత్మ అందరిలో ఉంటుంది కానీ శరీరము చిన్నదిగా-పెద్దదిగా అవుతుంది. నేను మీ చిన్న బాలుడిగా అయ్యాను అని ఆత్మ చెప్తుంది. అచ్ఛా, నా వారిగా అయినట్లయితే ఇప్పుడు చదువుకోండి. పాలు తాగే పిల్లలు కాదు కదా. చదువు ఫస్ట్. ఇందులో చాలా అటెన్షన్ పెట్టాలి. ఇక్కడ ఈ సుప్రీమ్ టీచరు వద్దకు విద్యార్థులు వస్తారు. చదివించే టీచర్లు కూడా నిర్ణయించబడి ఉన్నారు. అయినా వీరు సుప్రీమ్ టీచరు కదా. 7 రోజుల భట్టీ కూడా గాయనం చేయబడింది. పవిత్రంగా అవ్వండి మరియు నన్ను స్మృతి చేయండి. దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే మీరు ఈ విధంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. చిన్న పిల్లలను వారి తల్లిదండ్రులు తప్ప ఇంకెవరైనా ఎత్తుకుంటే వారు వెళ్ళరు. మీరు కూడా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక ఇంకెవరినైనా చూడడం కూడా ఇష్టమనిపించదు, వారు ఎవరైనా కావచ్చు. మేము ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి చెందినవారిమని మీకు తెలుసు. వారు మమ్మల్ని డబల్ కిరీటధారులుగా, రాజులకే రాజులుగా తయారుచేస్తారు. ప్రకాశ కిరీటము మన్మనాభవ మరియు రత్నజడిత కిరీటము మధ్యాజీభవ. మేము ఈ చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతామనే నిశ్చయం ఏర్పడుతుంది, 5 వేల సంవత్సరాల తర్వాత చరిత్ర పునరావృతమౌతుంది కదా. మీకు రాజ్యము లభిస్తుంది. మిగిలిన ఆత్మలన్నీ తమ ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతాయి. నిజానికి ఆత్మలైన మనము తండ్రితోపాటు మన ఇంట్లో ఉంటామని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది. తండ్రికి చెందినవారిగా అవ్వడము వలన ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు, మళ్ళీ తండ్రిని మర్చిపోయి అనాథలుగా అయిపోతారు. భారత్ ఈ సమయంలో అనాథగా ఉంది. ఎవరికైతే తల్లిదండ్రులుండరో వారిని అనాథలు అని అంటారు. వారు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు, మీరు మొత్తం సృష్టిచక్రాన్ని తెలుసుకున్నారు కనుక సంతోషంతో పులకరించిపోవాలి. మనము అనంతమైన తండ్రి పిల్లలము. పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల కొత్త సృష్టిని రచిస్తారు. ఇదైతే చాలా సహజంగా అర్థము చేసుకునే విషయము. మీ చిత్రాలు కూడా ఉన్నాయి, విరాటరూప చిత్రము కూడా తయారుచేశారు. 84 జన్మల కథను చూపించారు. మనమే దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఈ విషయాలు మనుష్యులెవ్వరికీ తెలియదు ఎందుకంటే బ్రాహ్మణులను, మరియు బ్రాహ్మణులను చదివించే తండ్రిని, ఇరువురి నామ-రూపాలను మాయం చేసేశారు. ఇంగ్లీషులో కూడా మీరు బాగా అర్థము చేయించగలరు. ఇంగ్లీషు తెలిసినవారైతే ట్రాన్సలేషన్ (అనువాదము) చేసి, అప్పుడు అర్థము చేయించాలి. తండ్రి జ్ఞానసాగరుడు, సృష్టిచక్రము ఎలా తిరుగుతుందనే జ్ఞానము వారికి మాత్రమే ఉంది. ఇది చదువు. యోగము కూడా బాబా స్మృతి అని అనబడుతుంది, దీనిని ఆంగ్లములో కమ్యూనియన్ (సంబంధము) అని అంటారు. తండ్రితో కమ్యూనియన్, టీచరుతో కమ్యూనియన్, గురువుతో కమ్యూనియన్. ఇది గాడ్ ఫాదర్ తో కమ్యూనియన్. నన్ను స్మృతి చేయండి, ఇంకే దేహధారిని స్మృతి చేయకండి అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. మనుష్యులు, గురువులు మొదలైనవారిని ఆశ్రయిస్తారు, శాస్త్రాలను చదువుతారు. లక్ష్యమూ-ఉద్దేశ్యమూ ఏ మాత్రం ఉండదు. సద్గతి అయితే లభించదు. నేను అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చానని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు తండ్రితో బుద్ధియోగాన్ని జోడించాలి, అప్పుడు మీరు అక్కడకు చేరుకుంటారు. బాగా స్మృతి చేయడం వలన విశ్వానికి యజమానులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. మీకు అర్థం చేయించే వారెవరు. తండ్రిని జ్ఞానసాగరుడని అంటారు. మనుష్యులు అంతర్యామి అని అంటారు. వాస్తవానికి అంతర్యామి అనే పదమే లేదు. ప్రతి ఒక్కరి లోపల నివసించేది ఆత్మ. ఆత్మ చేసే పని అందరికీ తెలుసు. మనుష్యులందరూ అంతర్యాములే. ఆత్మయే నేర్చుకుంటుంది. తండ్రి, పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు. ఆత్మలైన మీరు మూలవతనంలో నివసించేవారు. ఆత్మలైన మీరు ఎంత చిన్నగా ఉంటారు. పాత్రను అభినయించడానికి మీరు అనేకసార్లు వచ్చారు. నేను బిందువును, నన్ను పూజించలేరు అని తండ్రి చెప్తున్నారు. ఎందుకు పూజిస్తారు, అవసరమే లేదు. నేను ఆత్మలైన మిమ్మల్ని చదివించడానికి వస్తాను. మీకే రాజ్యాన్నిస్తాను మళ్ళీ రామరాజ్యములోకి వెళ్ళినప్పుడు నన్నే మర్చిపోతారు. మొట్టమొదట పాత్రను అభినయించేందుకు ఆత్మ వస్తుంది. 84 లక్షల జన్మలు తీసుకుంటారని మనుష్యులంటారు. కానీ ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు మాత్రమే ఉంటాయని తండ్రి చెప్తున్నారు. విదేశాలకు వెళ్ళి ఈ విషయాలను తెలియజేసినట్లయితే మాకు ఈ జ్ఞానము ఇక్కడే కూర్చుని నేర్పించండి అని అంటారు. మీకు అక్కడ వెయ్యి రూపాయలు లభిస్తాయి, మేము మీకు 10-20 వేల రూపాయలు ఇస్తాము, మాకు కూడా జ్ఞానాన్ని వినిపించండి అని అంటారు. గాడ్ ఫాదర్ ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. ఆత్మనే జడ్జి మొదలైనవారిగా అవుతుంది. మిగిలిన మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. గొప్ప-గొప్ప వేదాంతులు మొదలైనవారు చాలామంది ఉన్నారు, కానీ ఈ జ్ఞానము ఎవ్వరికీ ఉండదు. నిరాకారుడైన గాడ్ ఫాదర్ చదివించేందుకు వచ్చారు, మేము వారి ద్వారా చదువుకుంటున్నాము. వారు ఈ విషయాలు విని ఆశ్చర్యపోతారు. ఈ విషయాలనైతే ఎప్పుడూ చదవలేదు, వినలేదు. ఒక్క తండ్రిని మాత్రమే మార్గదర్శకులు, ముక్తిదాత అని అంటారు. ముక్తిదాత వారే అయినప్పుడు మరి క్రీస్తును ఎందుకు స్మృతి చేస్తారు? ఈ విషయాలను బాగా అర్థం చేయించినట్లయితే వారు ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను మమ్మల్ని కనీసం విననివ్వండి అని అంటారు. స్వర్గస్థాపన జరుగుతోంది, దానికోసమే ఈ మహాభారత యుద్ధము కూడా ఉంది. నేను మిమ్మల్ని రాజులకే రాజుగా, డబల్ కిరీటధారులుగా తయారుచేస్తాను అని తండ్రి చెప్తున్నారు. పవిత్రత, శాంతి, సంపద అన్నీ ఉండేవి. ఎన్ని సంవత్సరాలయ్యింది? ఆలోచించండి. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము వీరి రాజ్యముండేది కదా. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని మీరంటారు. వీరు (బ్రహ్మా) డైరక్టు ఆ సుప్రీమ్ ఫాదర్ సంతానము, వారి నుండి రాజయోగము నేర్చుకుంటున్నారు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా పునరావృతమౌతాయి అనే మొత్తం జ్ఞానం వారికి ఉంది. ఆత్మలైన మనలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ యోగశక్తితో ఆత్మ సతోప్రధానంగా అయి స్వర్ణిమ యుగములోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ ఆత్మ కోసం రాజ్యము కావాలి. పాత ప్రపంచ వినాశనము కూడా జరగాలి. అది ఎదురుగా నిలిచి ఉంది, ఆ తర్వాత ఏక ధర్మ రాజ్యముంటుంది. ఇది పాపాత్మల ప్రపంచము కదా. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు, ఈ స్మృతి బలం ద్వారా మేము పవిత్రంగా అవుతాము మరియు అందరి వినాశనము జరుగుతుందని చెప్పండి. ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి. ఇదంతా సమాప్తమవ్వనున్నదని మేము అనుభవము చేశాము మరియు దివ్యదృష్టి ద్వారా చూశాము. తండ్రి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. ఇవి విని వారు ఓహో! వీరు గాడ్ ఫాదర్ సంతానము అని అంటారు. యుద్ధము జరుగుతుందని, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని పిల్లలైన మీకు తెలుసు. ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఈ పెద్ద-పెద్ద భవనాలు మొదలైనవన్నీ పడిపోతాయి. ఈ బాంబులు మొదలైనవాటిని 5 వేల సంవత్సరాల క్రితము కూడా తమ వినాశనము కోసమే తయారుచేశారని మీకు తెలుసు. ఇప్పుడు కూడా బాంబులు తయారుగా ఉన్నాయి. మీరు విశ్వముపై విజయాన్ని పొందడానికి ఆధారమైన ఆ యోగబలము అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. సైన్సు మిమ్మల్నే వినాశనము చేస్తుంది, మాకు తండ్రితోపాటు యోగముంది కనుక ఆ సైలెన్స్ శక్తి ద్వారా మేము విశ్వముపై విజయాన్ని పొంది సతోప్రధానంగా అవుతామని చెప్పండి. తండ్రియే పతిత-పావనుడు. పావన ప్రపంచాన్ని తప్పకుండా స్థాపన చేసే తీరుతారు. డ్రామానుసారముగా నిర్ణయింపబడి ఉంది. తయారుచేసిన బాంబులనైతే అలాగే ఉంచుకుంటారా! ఈ విధంగా అర్థము చేయించినట్లయితే వీరి వద్ద ఏదో అథారిటీ ఉంది, వీరిలో భగవంతుడు ప్రవేశించారని భావిస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇటువంటి విషయాలు తెలియజేస్తూ ఉన్నట్లయితే వారు సంతోషిస్తారు. ఆత్మలో పాత్ర ఏ విధంగా ఉంది, ఇది కూడా అనాదిగా తయారై-తయారవుతున్న డ్రామా. క్రీస్తు తమ సమయానికి వచ్చి మళ్ళీ ధర్మ స్థాపన చేస్తారు. ఈ విధంగా అథారిటీతో చెప్పినట్లయితే తండ్రి పిల్లలందరికీ కూర్చుని అర్థం చేయిస్తున్నారని వారు భావిస్తారు. కనుక పిల్లలు ఈ చదువులో నిమగ్నమైపోవాలి. తండ్రి, టీచరు, గురువు ముగ్గురూ ఒక్కరే. వారు జ్ఞానాన్ని ఎలా ఇస్తారో కూడా మీకు తెలుసు. అందరినీ పవిత్రంగా తయారుచేసి తీసుకువెళ్తారు. దైవీ రాజ్యమున్నప్పుడు పవిత్రంగా ఉండేవారు. దేవీ-దేవతలుండేవారు. మాట్లాడడంలో చాలా తెలివైనవారిగా ఉండాలి, వేగము కూడా బాగుండాలి. మిగిలిన ఆత్మలన్నీ స్వీట్ హోమ్ లో ఉంటాయని చెప్పండి. బాబానే తీసుకువెళ్తారు, ఆ తండ్రియే సర్వుల సద్గతిదాత. భారత్ వారి జన్మ స్థానము. ఇది ఎంత గొప్ప తీర్థ స్థానము అయ్యింది.

అందరూ తమోప్రధానంగా తప్పకుండా అవ్వాల్సిందే అని మీకు తెలుసు. అందరూ పునర్జన్మలు తీసుకోవాలి, తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. ఇటువంటి విషయాలు అర్థం చేయిస్తే చాలా ఆశ్చర్యపోతారు. జోడి ఉన్నట్లయితే మీరు చాలా బాగా అర్థం చేయించగలరు అని తండ్రి చెప్తున్నారు. భారత్ లో మొదట పవిత్రత ఉండేది. తర్వాత అపవిత్రంగా ఎలా అవుతారు. ఇది కూడా తెలియజేయవచ్చు. పూజ్యులే పూజారులుగా అవుతారు. అపవిత్రంగా అయినప్పుడు మళ్ళీ తమను తామే పూజించుకోవడం ప్రారంభిస్తారు. రాజుల ఇళ్ళలో కూడా ఈ దేవతల చిత్రాలుంటాయి, పవిత్రంగా డబల్ కిరీటధారులుగా ఉన్నవారిని కిరీటము లేని అపవిత్రంగా ఉన్న రాజులు పూజిస్తారు. వారు పూజారీ రాజులు. వారిని గాడ్-గాడెస్ అని అనరు ఎందుకంటే వారు ఈ దేవతలను పూజిస్తారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. పతితంగా అయినప్పుడు రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రావణ రాజ్యము ఉంది. ఈ విధంగా కూర్చుని అర్థం చేయించినట్లయితే వారు ఎంతో ఆనందిస్తారు. బండికి రెండు చక్రాలవంటి యుగల్ కలిసి అర్థం చేయిస్తే చాలా అద్భుతము చేసి చూపిస్తారు. యుగల్ అయిన మేమే మళ్ళీ పూజ్యులుగా అవుతాము. మేము పవిత్రత, శాంతి, సంపదల వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మీ చిత్రాలు కూడా వెలువడుతూ ఉంటాయి. ఇది ఈశ్వరీయ పరివారము. తండ్రికి పిల్లలు, మనవళ్లు మరియు మనవరాళ్లు, అంతే, ఇంకే సంబంధమూ లేదు. దీన్నే కొత్త సృష్టి అని అంటారు, ఆ తర్వాత కొద్దిమందే దేవీ-దేవతలుగా అవుతారు. మళ్ళీ నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఇది ఎంతగా అర్థము చేసుకోవలసిన జ్ఞానం. ఈ బాబా కూడా వ్యాపారములో నవాబులా ఉండేవారు. ఏ విషయము గురించి చింత ఉండేది కాదు. తండ్రి చదివిస్తున్నారు, వినాశనము ఎదురుగా నిలబడి ఉంది అని చూసినప్పుడు వెంటనే వదిలేశారు. నాకు రాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మళ్ళీ గాడిద చాకిరి ఎందుకు చేయాలి అని సరిగ్గా అర్థం చేసుకున్నారు. భగవంతుడు చదివిస్తున్నారు కనుక దీనిని పూర్తిగా చదవుకోవాలి కదా అని మీరు కూడా భావిస్తారు. వారి మతంపై నడుచుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రిని మీరు మర్చిపోతున్నారా, సిగ్గుగా అనిపించడం లేదా, ఆ నషా ఎక్కడం లేదు. ఇక్కడ నుండి చాలా బాగా రిఫ్రెష్ అయ్యి వెళ్తారు, మళ్ళీ అక్కడ సోడా వాటర్ గా అయిపోతారు. ప్రతి గ్రామములో సేవ చేసే పురుషార్థాన్ని పిల్లలైన మీరిప్పుడు చేస్తున్నారు. ఆత్మల తండ్రి ఎవరు అన్న విషయాన్ని మొట్టమొదట తెలియజేయాలని తండ్రి చెప్తున్నారు. భగవంతుడు అయితే నిరాకారుడు. వారే ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయంగా భగవంతుడే సుప్రీమ్ టీచరుగా అయి చదివిస్తున్నారు కనుక బాగా చదువుకోవాలి, వారి మతంపై నడుచుకోవాలి.

2. సైలెన్స్ బలము జమ అయ్యే విధంగా తండ్రితో యోగము జోడించాలి. సైలెన్స్ బలముతో విశ్వముపై విజయము పొందాలి, పతితుల నుండి పావనంగా అవ్వాలి.

వరదానము:- ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా ధరణిని ఫలదాయకంగా తయారుచేసే ధైర్యశాలీ భవ

పిల్లలైన మీరు ధైర్యవంతులుగా అయి సంగఠనలో ఏకమతము మరియు ఏకరస స్థితిలో ఉన్నప్పుడు లేక ఒకే కార్యములో నిమగ్నమైనప్పుడు స్వయం కూడా సదా వికసించి ఉంటారు మరియు ధరణిని కూడా ఫలదాయకంగా చేస్తారు. ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్ ద్వారా ఇప్పటికిప్పుడు బీజం వేయగానే ఇప్పటికిప్పుడే ఫలము లభిస్తుందో, అదే విధంగా సైలెన్స్ బలము ద్వారా సహజంగా మరియు తీవ్ర వేగంతో ప్రత్యక్షతను చూస్తారు. స్వయం నిర్విఘ్నంగా అయి ఒక్క తండ్రి తపనలో నిమగ్నమై, ఏకమతంతో మరియు ఏకరసంగా ఉన్నప్పుడు ఇతర ఆత్మలు కూడా స్వతహాగా సహయోగులుగా అవుతారు మరియు ధరణి ఫలదాయకంగా అయిపోతుంది.

స్లోగన్:- ఎవరైతే అభిమానాన్ని గౌరవంగా భావిస్తారో, వారు నమ్రచిత్తులుగా ఉండలేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *