Telugu Murli 25/08/20

25-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైన పిల్లలూ – అలసిపోయి ఎప్పుడూ స్మృతియాత్రను వదిలేయకూడదు, సదా దేహీ-అభిమానిగా ఉండేందుకు ప్రయత్నించండి, తండ్రి ప్రేమను ఆకర్షించేందుకు మరియు మధురంగా అయ్యేందుకు స్మృతిలో ఉండండి”

ప్రశ్న:- 16 కళా సంపూర్ణులుగా మరియు పర్ఫెక్ట్ గా అయ్యేందుకు ఎటువంటి పురుషార్థం తప్పకుండా చేయాలి?

జవాబు:- ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించండి. ప్రేమసాగరుడైన తండ్రిని స్మృతి చేసినట్లయితే పర్ఫెక్ట్ గా అయిపోతారు. జ్ఞానము చాలా సహజము కానీ 16 కళా సంపూర్ణంగా అయ్యేందుకు స్మృతి ద్వారా ఆత్మను పర్ఫక్ట్ గా తయారుచేసుకోవాలి. ఆత్మగా భావించడం వలన మధురంగా అయిపోతారు. అన్ని గొడవలు సమాప్తమైపోతాయి.

గీతము:- నీవు ప్రేమ సాగరుడవు…… (తూ ప్యార్ కా సాగర్ హై……)

ఓంశాంతి. ప్రేమసాగరుడు తన పిల్లలను కూడా అటువంటి ప్రేమసాగరులుగా తయారుచేస్తారు. మేము ఈ విధంగా లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలి అని పిల్లలకు లక్ష్యం-ఉద్దేశ్యం ఉంది. వీరిని అందరూ ఎంతగా ప్రేమిస్తారు. బాబా మనల్ని వీరిలా మధురంగా తయారుచేస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇక్కడే మధురంగా తయారవ్వాలి మరియు స్మృతి ద్వారానే అలా తయారవుతారు. భారత్ యొక్క యోగము గాయనం చేయబడింది, ఇది స్మృతి. ఈ స్మృతి ద్వారానే మీరు వీరిలా విశ్వానికి యజమానులుగా అవుతారు. పిల్లలు ఈ శ్రమనే చేయాలి. మాకు చాలా జ్ఞానము ఉంది అన్న అహంకారంలోకి మీరు రాకండి. ముఖ్యమైన విషయము స్మృతి. స్మృతియే ప్రేమను ఇస్తుంది. చాలా మధురంగా, చాలా ప్రియంగా అవ్వాలనుకుంటే, ఉన్నత పదవిని పొందాలనుకుంటే శ్రమ చేయండి లేకపోతే చాలా పశ్చాత్తాపపడతారు, ఎందుకంటే చాలా మంది పిల్లలు స్మృతిలో ఉండలేరు, అలసిపోతే ఇక స్మృతిని వదిలేస్తారు. ఒకటి, దేహీ-అభిమానులుగా అయ్యేందుకు చాలా ప్రయత్నించండి. లేకపోతే చాలా తక్కువ పదవిని పొందుతారు. అంత మధురంగా ఎప్పటికీ తయారవ్వరు. చాలా కొద్దిమంది పిల్లలు మాత్రమే ఆకర్షిస్తారు ఎందుకంటే వారు స్మృతిలో ఉంటారు. కేవలం తండ్రి స్మృతి అవసరము. ఎంతెంతగా స్మృతి చేస్తారో, అంతంతగా చాలా మధురంగా అవుతారు. కేవలం తండ్రి స్మృతి కావాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా చాలా మధురంగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా ముందు జన్మలో చాలా స్మృతి చేశారు. స్మృతి ద్వారానే మధురంగా అయ్యారు. సత్యయుగ సూర్యవంశీయులు మొదటి నెంబరులో ఉన్నారు, చంద్రవంశీయులు రెండవ నెంబరు కలవారిగా ఉన్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు చాలా ప్రియమనిపిస్తారు. ఈ లక్ష్మీ-నారాయణుల రూపురేఖలకు మరియు సీతా-రాముల రూపురేఖలకు చాలా తేడా ఉంటుంది. ఈ లక్ష్మీ-నారాయణులపై ఎప్పుడూ ఎవ్వరూ ఏ కళంకమును మోపలేదు. కృష్ణునిపై పొరపాటుగా కళంకము మోపారు, సీతా-రాములపై కూడా కళంకము మోపారు.

నేను ఆత్మను అని భావించినప్పుడే చాలా మధురంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడంలో చాలా ఆనందము ఉంటుంది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సతోప్రధానంగా, 16 కళా సంపూర్ణంగా అవుతారు. 14 కళలు అనగా కొద్దిగా లోపము ఉన్నట్లు, తర్వాత ఇంకా లోపాలు పెరుగుతూ ఉంటాయి. 16 కళా పర్ఫెక్ట్ గా అవ్వాలి. జ్ఞానమైతే చాలా సహజము. ఎవరైనా నేర్చుకోగలుగుతారు. కల్ప-కల్పము 84 జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఎప్పటివరకైతే పూర్తిగా పవిత్రంగా అవ్వరో, అప్పటివరకూ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. లేకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఎంత వీలైతే అంత, నేను ఆత్మను అన్న ఈ ఒక్క విషయాన్ని మొట్టమొదట పక్కా చేసుకోండి అని తండ్రి పదే-పదే అర్థం చేయిస్తున్నారు. ఆత్మలైన మనము మన ఇంటిలో ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉంటాము, తర్వాత ఇక్కడ జన్మలు తీసుకుంటాము. కొందరు కొన్ని జన్మలు, కొందరు కొన్ని జన్మలు తీసుకుంటారు. చివర్లో తమోప్రధానంగా అవుతారు. ప్రపంచము యొక్క ఆ గౌరవము తగ్గిపోతూ ఉంటుంది. ఇల్లు కొత్తదిగా ఉన్నప్పుడు, అందులో ఎంత విశ్రాంతి లభిస్తుంది. తర్వాత లోపాలు ఏర్పడతాయి, కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ పిల్లలైన మీరు పర్ఫెక్ట్ ప్రపంచములోకి వెళ్ళాలనుకుంటే పర్ఫెక్ట్ గా అవ్వాలి. కేవలం జ్ఞానాన్ని పర్ఫెక్ట్ అని అనరు. ఆత్మ పర్ఫెక్ట్ గా అవ్వాలి. ఎంత వీలైతే అంత, నేను ఆత్మను, బాబా సంతానాన్ని అని గుర్తుంచుకునేందుకు ప్రయత్నించండి. లోపల చాలా సంతోషం ఉండాలి. మనుష్యులు స్వయాన్ని దేహధారిగా భావిస్తూ సంతోషిస్తారు. నేను ఫలానా వారి సంతానాన్ని…… ఇది అల్పకాలపు నషా. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రితో పూర్తిగా బుద్ధియోగాన్ని జోడించాలి, ఇందులో తికమకపడకూడదు. విదేశాలలో ఎక్కడికైనా వెళ్ళండి, కేవలం బాబాను స్మృతి చేయాలి అన్న ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి. బాబా ప్రేమ సాగరుడు. ఈ మహిమ మనుష్యులెవరిదీ కాదు. ఆత్మ తన తండ్రి మహిమ చేస్తుంది. ఆత్మలందరూ పరస్పరము సోదరులు. అందరికీ తండ్రి ఒక్కరే. పిల్లలూ, మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు, తమోప్రధానంగా అవ్వడం వలన మీరు దుఃఖితులుగా అయ్యారు అని బాబా అందరికీ చెప్తున్నారు. మీరు మొదట పర్ఫెక్ట్ గా ఉండేవారు అని ఇప్పుడు ఆత్మనైన నాకు పరమాత్మ తండ్రి చెప్తున్నారు. ఆత్మలన్నీ అక్కడ పర్ఫెక్ట్ గానే ఉంటాయి. పాత్ర వేర్వేరుగా ఉంటుంది కానీ పర్ఫెక్ట్ గా ఉంటారు కదా. పవిత్రత లేకుండా అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు. సుఖధామములో మీకు సుఖం కూడా ఉంటుంది మరియు శాంతి కూడా ఉంటుంది, కనుక మీది ఉన్నతాతి ఉన్నతమైన ధర్మము. అక్కడ అపారమైన సుఖముంటుంది. మేము ఎలా తయారవుతాము అన్నది ఆలోచించండి. స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము. అది వజ్రం లాంటి జన్మ. ఇప్పుడు ఇది గవ్వ లాంటి జన్మ. ఇప్పుడు స్మృతిలో ఉండమని తండ్రి సూచననిస్తున్నారు. మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారుచేయండి అని మీరు పిలుస్తారు. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులుంటారు. సీతా-రాములను కూడా సంపూర్ణులు అని అనరు. వారు రెండవ శ్రేణిలోకి వెళ్ళిపోయారు. స్మృతియాత్రలో పాస్ అవ్వలేదు. జ్ఞానములో ఎంత చురుకుగా ఉన్నా కూడా, ఎప్పటికీ తండ్రికి మధురంగా అనిపించరు. స్మృతిలో ఉన్నప్పుడు మాత్రమే మధురంగా అవుతారు. అప్పుడు తండ్రి కూడా మీకు మధురంగా అనిపిస్తారు. చదువు అయితే చాలా సాధారణమైనది, పవిత్రంగా అవ్వాలి, స్మృతిలో ఉండాలి. ఇది బాగా నోట్ చేసుకోండి. స్మృతియాత్రలో ఉండడం వలన – అప్పుడప్పుడు వచ్చే గొడవలు కానీ, అహంకారము రావడం అనేది కానీ ఎప్పుడూ జరగవు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము అనేది ముఖ్యమైన విషయం. ప్రపంచంలో మనుష్యులు ఎంతగా కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. జీవితాన్నే విషపూరితంగా చేసుకుంటారు. ఈ పదాలు సత్యయుగంలో ఉండవు. ఇక్కడైతే మనుష్యుల జీవితము మున్ముందు ఇంకా విషపూరితంగా అయిపోతుంది. ఇది విషయ సాగరము. అందరూ రౌరవ నరకములో పడి ఉన్నారు, ఇది చాలా అశుద్ధంగా ఉంది. రోజు-రోజుకూ అశుద్ధత వృద్ధి చెందుతూ ఉంటుంది. దీనిని అశుద్ధమైన ప్రపంచమని అంటారు. దేహాభిమాన భూతము, కామము యొక్క భూతము ఉండడంతో ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ భూతాలను పారద్రోలండి, ఈ భూతాలే మీ ముఖాన్ని నల్లగా చేస్తాయి అని తండ్రి చెప్తున్నారు. కామచితిపై కూర్చుని నల్లగా అయినప్పుడు నేను వచ్చి మళ్ళీ జ్ఞానామృత వర్షాన్ని కురిపిస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా తయారవుతున్నారు! అక్కడైతే వజ్రాల మహళ్ళు ఉంటాయి, అన్ని రకాల వైభవాలుంటాయి. ఇక్కడ అన్నీ కల్తీ వస్తువులే ఉన్నాయి. ఆవుల ఆహారాన్ని చూడండి, అన్నిటి నుండి సారాన్ని తీసేసి మిగిలింది ఇస్తారు. ఆవులకు మంచి ఆహారము కూడా లభించదు. కృష్ణుని ఆవులను ఎంత ఫస్ట్ క్లాస్ గా చూపిస్తారో చూడండి. సత్యయుగంలో ఆవులు ఎలా ఉంటాయో, ఇక అడగకండి. వాటిని చూస్తేనే ఆనందము కలుగుతుంది. ఇక్కడైతే ప్రతి వస్తువు నుండి సారాన్ని తీసేస్తారు. ఇది చాలా ఛీ-ఛీ అశుద్ధమైన ప్రపంచము. మీరు దీనిపై మనసు పెట్టుకోకూడదు. మీరు ఎంత వికారులుగా అయిపోయారు అని తండ్రి అంటున్నారు. యుద్ధంలో ఒకరినొకరు ఎలా చంపుకుంటూ ఉంటారు. అణుబాంబులు తయారుచేసేవారికి కూడా ఎంత గౌరవముంటుంది, వీటి ద్వారా అందరి వినాశనము జరుగుతుంది. నేటి మనుష్యులు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారు అనేది తండ్రి కూర్చుని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు. మంచి సాంగత్యం తేలుస్తుంది, కుసాంగత్యం ముంచేస్తుంది. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రి చేతిని పట్టుకున్నారు. ఎవరైనా ఈత నేర్చుకునేటప్పుడు, నేర్పించేవారి చేతిని పట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే గుటకలు మింగుతారు, ఇందులో కూడా చేయి పట్టుకోవాలి. లేకపోతే మాయ ఆకర్షిస్తుంది. మీరు ఈ విశ్వమంతటినీ స్వర్గంగా తయారుచేస్తారు. మేము శ్రీమతము ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని స్వయాన్ని నషాలోకి తెచ్చుకోవాలి. మనుష్యమాత్రులందరూ దానము చేస్తూనే ఉంటారు. ఫకీరులకు ఇస్తారు. తీర్థయాత్రలలో మార్గదర్శకులకు దానము చేస్తారు, పిడికెడు బియ్యమైనా తప్పకుండా దానం చేస్తారు. అవన్నీ భక్తిమార్గంలో నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు బాబా మనల్ని డబల్ దాతలుగా తయారుచేస్తారు. మూడు అడుగుల భూమిలో మీరు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని, ఈశ్వరీయ ఆసుపత్రిని తెరవండి, ఇందులోకి వచ్చి మనుష్యులు 21 జన్మల కోసం సుఖాన్ని పొందుతారు అని తండ్రి చెప్తున్నారు. ఇక్కడైతే ఎటువంటి రోగాలు వస్తాయి. అనారోగ్యములో ఎంతటి దుర్వాసన వస్తుంది. ఆసుపత్రులలో చూసినట్లయితే అసహ్యము కలుగుతుంది. ఎంత కర్మభోగముంది. ఈ దుఃఖాలన్నిటి నుండి దూరమయ్యేందుకు, కేవలం స్మృతి చేయండి, మీకు ఇంకే కష్టమూ ఇవ్వను అని తండ్రి చెప్తున్నారు. పిల్లలు చాలా కష్టాలు చూశారని బాబాకు తెలుసు. వికారీ మనుష్యుల ముఖమే మారిపోతుంది. ఒక్కసారిగా శవము వలె అయిపోతారు. మద్యం తాగేవారు మద్యం లేకుండా ఉండలేరు. మద్యంతో చాలా నషా ఎక్కుతుంది కానీ అల్పకాలానికి మాత్రమే. దీనితో వికారీ మనుష్యుల ఆయుష్షు కూడా ఎంతగా తగ్గిపోతుంది. నిర్వికారీ దేవతల ఆయుష్షు సగటున 125-150 సంవత్సరాలుంటుంది. సదా ఆరోగ్యవంతులుగా ఉన్నట్లయితే ఆయుష్షు కూడా పెరుగుతుంది కదా. శరీరము నిరోగిగా అయిపోతుంది. తండ్రిని అవినాశి సర్జన్ అని కూడా అంటారు. జ్ఞాన ఇంజెక్షన్ సద్గురువు ఇచ్చారు, అజ్ఞానాంధకారము వినాశనమయ్యింది. తండ్రిని తెలుసుకోలేదు, అందుకే అజ్ఞానాంధకారము అని అంటారు, ఇది భారతవాసుల విషయమే. ఫలానా శకంలో వచ్చారని క్రీస్తు గురించి అయితే తెలుసు. పోప్ నంబరువారుగా గద్ది పై ఎలా కూర్చుంటారో వారి పూర్తి లిస్ట్ ఉంటుంది. ఒక్క భారత్ కు మాత్రమే ఎవరి జీవితచరిత్ర గురించి తెలియదు. ఓ దుఃఖహర్త-సుఖకర్త పరమాత్మా, ఓ మాతా-పితా….. అని కూడా పిలుస్తారు. అచ్ఛా, మాతా-పితల జీవితచరిత్ర గురించి చెప్పండి అంటే ఏ మాత్రం తెలియదు.

ఇది పురుషోత్తమ సంగమయుగమని మీకు తెలుసు. ఇప్పుడు మనము పురుషోత్తములుగా అవుతున్నాము కావున పూర్తిగా చదువుకోవాలి. లోక-మర్యాదలు, కులమర్యాదలలో కూడా చాలామంది చిక్కుకొని ఉంటారు. ఈ బాబా అయితే ఎవరినీ లెక్క చేయలేదు. ఎన్నో తిట్లు మొదలైనవి తిన్నారు, మనస్సులో కాని, స్వప్నంలో కాని అనుకోలేదు. దారిలో నడుస్తూ-నడుస్తూ బ్రాహ్మణుడు చిక్కుకున్నాడు. బాబా బ్రాహ్మణునిగా చేశాక వారు తిట్లు తిన్నారు. పంచాయితీ అంతా ఒకవైపు ఉండేది, దాదా ఇంకొకవైపు ఉండేవారు. మొత్తం సింధీ పంచాయితీ – నువ్వు ఏమి చేస్తున్నావు అని అడిగారు. అరే, గీతలో కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందినట్లయితే విశ్వానికి యజమానిగా అవుతారు అని భగవానువాచ ఉంది కదా. ఇవైతే గీతలోని పదాలు. కామ వికారాన్ని జయిస్తే నీవు జగత్ జీత్ గా అవుతావని నాకు కూడా కొందరు చెప్పారు. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా విజయము పొందారు కదా. ఇందులో యుద్ధము మొదలైన విషయమేమీ లేదు. మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి. నేను పవిత్రంగా అవుతాను అని స్త్రీ అంటే నేను అవ్వను అని పతి అంటారు. ఒకరు హంస, ఒకరు కొంగగా అవుతారు. తండ్రి వచ్చి జ్ఞానరత్నాలు ఏరుకునే హంసలుగా చేస్తారు. కానీ ఒకరు తయారయి, మరొకరు అవ్వకపోతే గొడవలు వస్తాయి. ప్రారంభంలో చాలా శక్తి ఉండేది. ఇప్పుడు అంత ధైర్యము ఎవ్వరికీ లేదు. మేము వారసులమని అంటారు, కానీ వారసులుగా అయ్యే విషయము వేరు. ప్రారంభంలోనైతే అద్భుతాలు జరిగాయి. గొప్ప-గొప్ప ఇళ్ళకు చెందినవారు వారసత్వము పొందడానికి వెంటనే ఇంటిని వదిలి వచ్చేసారు. కనుక వారు అర్హులుగా అయ్యారు. మొట్టమొదట వచ్చినవారైతే అద్భుతము చేశారు. ఇప్పుడు అటువంటివారు ఎవరో అరుదుగా వెలువడుతారు. లోక-మర్యాదలు చాలా ఉంటాయి. ప్రారంభంలో వచ్చిన వారు చాలా ధైర్యాన్ని చూపించారు. ఇప్పుడు ఎవరైనా అంత సాహసముంచడం చాలా కష్టము. అవును, పేదవారు చేయగలరు. మాలలో మణులుగా అయ్యేందుకు పురుషార్థము చేయవలసి ఉంటుంది. మాల అయితే చాలా పెద్దది. 8 మాల ఉంది, 108 మాల కూడా ఉంది, మళ్ళీ 16,108 మాల కూడా ఉంది. చాలా-చాలా శ్రమ చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. సత్యము చెప్పరు. మేము చాలా బాగున్నామని భావిస్తారు, వారి ద్వారా కూడా వికర్మలు జరుగుతాయి. జ్ఞానీ ఆత్మలు, బాగా అర్థము చేయిస్తారు కానీ యోగము ఉండదు, తండ్రి హృదయంపైకి ఎక్కలేరు. స్మృతిలోనే ఉండకపోతే హృదయంపైకి కూడా ఎక్కలేరు. స్మృతితోనే స్మృతి కలుస్తుంది కదా. ప్రారంభములో వెంటనే బలిహారమైపోయారు. ఇప్పుడు బలిహారమవ్వడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళడం కాదు. ముఖ్యమైన విషయం స్మృతి, అప్పుడే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. ఎంతగా కళలు తగ్గిపోతూ వచ్చాయో, అంతగా దుఃఖము పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కళలు మళ్ళీ ఎంతగా పెరుగుతాయో, అంతగా సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కుతుంది. చివర్లో మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఎక్కువగా స్మృతి చేసేవారికి ఏ పదవి లభిస్తుంది అన్నది అంతిమంలో చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. వినాశనం జరిగినప్పుడు మీరు స్వర్గ సాక్షాత్కారాలు అనే హల్వాను తింటారు. స్మృతిని పెంచమని బాబా పదే-పదే అర్థం చేయిస్తున్నారు. మీరు ఎవరికైనా కొద్దిగా జ్ఞానాన్ని అర్థం చేయించినా బాబా సంతోషించరు. ఒక పండితుని కథ కూడా ఉంది కదా. రామ-రామ అని అంటే సాగరాన్ని దాటవచ్చు అని చెప్తాడు. నిశ్చయములోనే విజయముంది అని చూపించేందుకు ఈ కథ చెప్తారు. తండ్రి పట్ల సంశయము వచ్చినట్లయితే నాశనం అయిపోతారు. తండ్రి స్మృతి ద్వారానే పాపము సమాప్తమవుతుంది, రాత్రి-పగలు ప్రయత్నించాలి. అప్పుడు కర్మేంద్రియాల చంచలత సమాప్తమైపోతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి చార్టు లేనివారు చాలామంది ఉన్నారు. అంటే పునాది లేదు. ఎంత వీలైతే అంత, ఎలాగైనా స్మృతి చేయాలి, అప్పుడే సతోప్రధానంగా, 16 కళా సంపూర్ణంగా అవుతారు. పవిత్రతతో పాటు స్మృతియాత్ర కూడా ఉండాలి. పవిత్రంగా ఉండడం ద్వారానే స్మృతిలో ఉండగలరు. ఈ పాయింట్లు బాగా ధారణ చేయండి. తండ్రి ఎంతటి నిరహంకారి. మున్ముందు అందరూ మీ చరణాలపై తల వంచుతారు. నిజంగా ఈ మాతలే స్వర్గ ద్వారాలను తెరుస్తారని అంటారు. స్మృతి యొక్క పదును ఇప్పుడు తక్కువగా ఉంది. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వడంలోనే శ్రమ ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పతిత ఛీ-ఛీ దుఃఖమయమైన ప్రపంచముపై మనస్సు పెట్టుకోకూడదు. ఒక్క తండ్రి చేతిని పట్టుకొని దీనిని దాటి వెళ్ళాలి.

2. మాలలో మణిగా అయ్యేందుకు చాలా సాహసంతో పురుషార్థము చేయాలి. జ్ఞానరత్నాలను ఏరుకునే హంసలుగా అవ్వాలి. ఎటువంటి వికర్మలూ చేయకూడదు.

వరదానము:- తండ్రి మరియు సేవ యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని అనుభవం చేసే సర్వ ఆకర్షణ ముక్త భవ

ఏ విధంగా సేవకునికి సదా సేవ మరియు యజమాని యొక్క స్మృతి ఉంటుందో, అదే విధంగా విశ్వ సేవకులు, సత్యమైన సేవాధారి పిల్లలకు కూడా తండ్రి మరియు సేవ తప్ప ఇంకేదీ గుర్తుండదు, దీని ద్వారానే ఏకరస స్థితిలో ఉండే అనుభవమవుతుంది. వారికి ఒక్క తండ్రి రసము తప్ప మిగిలిన అన్ని రసాలు నీరసంగా అనిపిస్తాయి. ఒక్క తండ్రి రసము అనుభవం అయిన కారణంగా ఇంకెక్కడకీ ఆకర్షణ వెళ్ళదు, ఈ ఏకరస స్థితి యొక్క తీవ్ర పురుషార్థమే సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా చేస్తుంది. ఇదే శ్రేష్ఠమైన గమ్యము.

స్లోగన్:- సున్నితమైన పరిస్థితుల యొక్క పేపర్ లో పాస్ అవ్వాలంటే మీ స్వభావాన్ని శక్తిశాలిగా చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *