Telugu Murli 29/08/2020

01-09-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైన పిల్లలూ – మీకు కర్మ-అకర్మ-వికర్మల గుహ్యగతిని వినిపించేందుకు తండ్రి వచ్చారు, ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా అయినప్పుడు కర్మలు అకర్మలుగా అవుతాయి, పతితంగా అవ్వడంతో వికర్మలవుతాయి”

ప్రశ్న:- ఆత్మపై తుప్పు ఏర్పడేందుకు కారణమేమిటి? తుప్పు ఏర్పడి ఉంది అన్నదానికి గుర్తులేమిటి?

జవాబు:- తుప్పు ఏర్పడేందుకు కారణము – వికారాలు. పతితంగా అవ్వడంతోనే తుప్పు ఏర్పడుతుంది. ఒకవేళ ఇప్పటివరకూ తుప్పు పట్టి ఉన్నట్లయితే వారికి పాత ప్రపంచం పట్ల ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. బుద్ధి అశుద్ధత వైపు వెళ్తూ ఉంటుంది. స్మృతిలో ఉండలేరు.

ఓంశాంతి. పిల్లలు దీని అర్థాన్ని అయితే తెలుసుకున్నారు. ఓం శాంతి అంటూనే ఆత్మలైన మనం ఇక్కడ నివసించేవారము కాదని నిశ్చయం ఏర్పడుతుంది. మేమైతే శాంతిధామ నివాసులము. ఇంట్లో ఉన్నప్పుడు శాంతి మన స్వధర్మము, ఇక్కడకు వచ్చి మళ్ళీ పాత్రను అభినయిస్తాము ఎందుకంటే శరీరముతో కర్మలు చేయవలసి వస్తుంది. కర్మలలో ఒకటి మంచివి, రెండు చెడు కర్మలు ఉంటాయి. రావణ రాజ్యములో చెడు కర్మలు జరుగుతాయి. రావణ రాజ్యములో అందరి కర్మలు వికర్మలుగా అయిపోయాయి. వికర్మలు చేయని మనిషి ఒక్కరు కూడా లేరు. సాధు-సన్యాసులు మొదలైనవారి వలన వికర్మలు జరగవు, ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు, సన్యాసం తీసుకున్నారు అని మనుష్యులు భావిస్తారు. వాస్తవానికి పవిత్రమైనవారు అని ఎవరిని అంటారో వారికి ఏమాత్రం తెలియదు. మేము పతితంగా ఉన్నామని కూడా అంటారు. పతిత-పావనుడిని పిలుస్తారు. వారు వచ్చేంతవరకు ప్రపంచము పావనంగా అవ్వదు. ఇక్కడ ఇది పాత పతిత ప్రపంచము, అందుకే పావన ప్రపంచాన్ని గుర్తు చేస్తారు. పావన ప్రపంచానికి వెళ్ళినప్పుడు పతిత ప్రపంచాన్ని గుర్తు చేయరు. ఆ ప్రపంచమే వేరు. ప్రతి ఒక్క వస్తువు కొత్తదిగా, మళ్ళీ పాతదిగా అవుతుంది కదా. కొత్త ప్రపంచంలో పతితంగా ఉన్నవారు ఒక్కరు కూడా ఉండరు. కొత్త ప్రపంచ రచయిత పరమపిత పరమాత్మ, వారే పతిత-పావనుడు, వారి రచన కూడా తప్పకుండా పావనంగా ఉండాలి. పతితం నుండి పావనంగా, పావనం నుండి పతితంగా, ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. కల్ప-కల్పము తండ్రియే వచ్చి అర్థము చేయిస్తారు. పిల్లలైన మీలో కూడా చాలామంది నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి మళ్ళీ సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు. మాయ ఒక్కసారిగా మింగేస్తుంది. మీరు మహారథులు కదా. భాషణ చేసేందుకు మహారథులనే పిలుస్తారు. మీరే మొదట పావనంగా, పూజ్యులుగా ఉండేవారు అని మహారాజులకు కూడా అర్థము చేయించాలి, ఇప్పుడైతే ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పావన ప్రపంచంలో భారతవాసులు మాత్రమే ఉండేవారు. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన డబల్ కిరీటధారులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. మహారథులు ఈ విధంగా అర్థం చేయించాలి కదా. ఈ నషాతో అర్థము చేయించవలసి ఉంటంది. భగవానువాచ – కామచితిపై కూర్చుని నల్లగా అయిపోతారు, మళ్ళీ జ్ఞానచితిపై కూర్చోవడంతో తెల్లగా అవుతారు. ఇప్పుడు ఎవరైతే అర్థం చేయిస్తారో, వారు కామచితిపై కూర్చోలేరు. కానీ ఇతరులకు అర్థం చేయిస్తూ-చేయిస్తూ కామచితిపై కూర్చునేవారు కూడా ఉన్నారు. ఈ రోజు ఇది అర్థం చేయిస్తారు, రేపు వికారాల్లో పడిపోతారు. మాయ ఎంత శక్తివంతమైనదో ఇక అడగకండి. ఇతరులకు అర్థం చేయించేవారే స్వయం కామచితిపై కూర్చుండిపోతారు. ఎంత పని జరిగింది అని మళ్ళీ పశ్చాత్తాపపడతారు. ఇది బాక్సింగ్ కదా. స్త్రీని చూడగానే ఆకర్షణ ఏర్పడుతుంది, నల్ల ముఖం చేసుకుంటారు. మాయ చాలా శక్తివంతమైనది. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతే వంద రెట్లు శిక్ష పడుతుంది. వారైతే శూద్రుల సమానంగా పతితంగా అయిపోయినట్టు. అమృతము తాగి మళ్ళీ బయటకు వెళ్ళి అశుద్ధమైన పనులు చేసి ఇతరులను సతాయిస్తారు అని గాయనము కూడా ఉంది. చప్పట్లు ఒక్క చేతితో మ్రోగవు, రెండు చేతులతోనే మ్రోగుతాయి. ఇద్దరూ పాడైపోతారు. అయినా కొందరైతే సమాచారాన్నిస్తారు, కొందరు సిగ్గుపడి సమాచారమే ఇవ్వరు. బ్రాహ్మణ కులములో పేరు పాడైపోకూడదని భావిస్తారు. యుద్ధంలో ఎవరైనా ఓడిపోతే, అరే ఇంత పెద్ద పెహల్వాన్ ని కూడా పడేశారు! అని హాహాకారాలు చేస్తారు. ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి. మాయ చెంపదెబ్బ వేస్తుంది, చాలా గొప్ప గమ్యం కదా.

ఎవరైతే సతోప్రధానంగా, సుందరంగా ఉండేవారో, వారే కామచితిపై కూర్చోవడం వలన నల్లగా తమోప్రధానంగా అయ్యారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేయిస్తారు. రాముడిని కూడా నల్లగా చేసేస్తారు. చాలామంది చిత్రాలను నల్లగా తయారుచేస్తారు. కానీ ముఖ్యమైన వారి గురించే అర్థము చేయించడం జరుగుతుంది. ఇక్కడైతే రామచంద్రుడిది కూడా నల్లని చిత్రము ఉంది, నల్లగా ఎందుకు తయారుచేశారు అని వారిని అడగాలి. ఇదైతే ఈశ్వరుని ద్వారా నిర్ణయింపబడింది, ఇది కొనసాగుతూ వస్తుంది అని అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఏమి జరుగుతుంది అనేది ఏమాత్రం వారికి తెలియదు. కామచితిపై కూర్చోవడం వలన పతితంగా, దుఃఖితులుగా, పైసా అంత విలువ కూడా లేనివారిగా అయిపోతారు అని మీకిప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. అది నిర్వికారీ ప్రపంచము. ఇది వికారీ ప్రపంచము. వీరు సూర్యవంశీయులు, వీరు చంద్రవంశీయులు, మళ్ళీ వైశ్యవంశీయులుగా అవ్వాల్సిందే, వామమార్గంలోకి రావడంతో ఇక వారు దేవతలుగా పిలవబడరు, అని ఈ విధంగా అర్థము చేయించాలి. జగన్నాథ మందిరంలో పైన దేవతల కులాన్ని చూపిస్తారు. దుస్తులు దేవతలవి కానీ చాలా అశుద్ధమైన పనులు చేస్తున్నట్లుగా చూపిస్తారు. తండ్రి అటెన్షన్ ఇప్పిస్తున్న విషయాలపై ధ్యానముంచాలి. మందిరాల్లో చాలా సేవ చేయవచ్చు. శ్రీనాథ ద్వారంలో కూడా అర్థము చేయించవచ్చు. వీరిని నల్లగా ఎందుకు తయారుచేశారని అడగాలి. ఇది అర్థము చేయించడం చాలా మంచిది. అది స్వర్ణ యుగం, ఇది ఇనుప యుగము. తుప్పు పడుతుంది కదా. ఇప్పుడు మీ తుప్పు తొలగిపోతూ ఉంది. అసలు స్మృతినే చేయకపోతే తుప్పు కూడా తొలగిపోదు. చాలా తుప్పు పట్టి ఉన్నట్లయితే పాత ప్రపంచము వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. వికారాల ద్వారానే అన్నిటికన్నా ఎక్కువ తుప్పు పడుతుంది. వికారాల ద్వారానే పతితంగా అయ్యారు. మా బుద్ధి అశుద్ధత వైపు వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మంచి-మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఫెయిల్ అయిపోతారు. ముఖ్యమైన విషయము పవిత్రత అని పిల్లలైన మీకిప్పుడు వివేకం లభించింది. మొదటి నుండి ఈ విషయముపైనే గొడవలు జరుగుతూ వచ్చాయి. తండ్రియే ఈ యుక్తిని రచించారు – మేము జ్ఞానామృతము త్రాగేందుకు వెళ్తున్నామని అందరూ చెప్పేవారు. జ్ఞానామృతం జ్ఞానసాగరుని వద్ద మాత్రమే ఉంది. శాస్త్రాలు చదవడం వలన ఎవ్వరూ పతితము నుండి పావనంగా అవ్వలేరు. పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇక్కడ పావనంగా అయిన తర్వాత ఎక్కడకి వెళ్తాము? ఫలానావారు మోక్షము పొందారని వారు భావిస్తారు. వాళ్ళకేమి తెలుసు, ఒకవేళ మోక్షము పొంది ఉంటే వారి కర్మకాండలు మొదలైనవి కూడా చేయలేరు. ఆత్మకు ఎటువంటి కష్టము కలగకూడదు, అంధకారంలో ఎదురు దెబ్బలు తినకూడదు అని ఇక్కడ జ్యోతి మొదలైనవి వెలిగిస్తారు. ఆత్మ అయితే ఒక శరీరము వదిలి వెళ్ళి ఇంకొకటి తీసుకుంటుంది. ఇది ఒక్క సెకండు విషయము. మరి అంధకారము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆచారము నడుస్తూ వస్తుంది, మీరు కూడా చేసేవారు, ఇప్పుడేమీ చేయరు. శరీరమైతే మట్టిలో కలిసిపోతుందని మీకు తెలుసు. అక్కడ ఇటువంటి ఆచారాలు-పద్ధతులు ఉండవు. ఈ రోజుల్లో రిద్ధి-సిద్ధుల విషయాలలో ఏమీ లేదు. ఎవరికైనా రెక్కలు వచ్చాయనుకోండి, ఎగరడం మొదలుపెడతారు, అప్పుడు ఏమవుతుంది, దాని వలన లాభమేముంటుంది? నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి చెప్తున్నారు. ఇది యోగాగ్ని, దీని ద్వారా పతితం నుండి పావనంగా అవుతారు. జ్ఞానంతో ధనము లభిస్తుంది. యోగముతో సదా ఆరోగ్యంగా, పవిత్రంగా, జ్ఞానంతో సదా సంపన్నంగా, ధనవంతులుగా అవుతారు. యోగి యొక్క ఆయుష్షు ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. భోగి యొక్క ఆయుష్షు తక్కువగా ఉంటుంది. కృష్ణుడిని యోగేశ్వరుడని అంటారు. ఈశ్వరుని స్మృతితో కృష్ణుడిగా అయ్యారు, వారిని స్వర్గంలో యోగేశ్వర్ అని అనరు. వారు రాకుమారుడు. గత జన్మలో చేసినటువంటి కర్మల వలన ఈ విధంగా అయ్యారు. కర్మ-అకర్మ-వికర్మల గతి గురించి కూడా తండ్రి అర్థము చేయించారు. అర్థకల్పం రామరాజ్యం, అర్థకల్పం రావణరాజ్యం. వికారాల్లోకి వెళ్ళడం అనేది అన్నిటికన్నా పెద్ద పాపము. అందరూ సోదరీ-సోదరులు కదా. ఆత్మలందరూ సోదరులు. భగవంతుడి సంతానము అయ్యి ఉండి అశుద్ధమైన కర్మలు ఎలా చేస్తారు. బి.కె.లైన మనము వికారాల్లోకి వెళ్ళము. ఈ యుక్తి ద్వారానే పవిత్రంగా ఉండగలరు. ఇప్పుడు రావణ రాజ్యము సమాప్తమైపోతుందని మీకు తెలుసు, తర్వాత ప్రతి ఒక్క ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. దీనినే ఇంటింటిలోనూ ప్రకాశం అని అంటారు. మీ జ్యోతి వెలిగి ఉంది. జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. సత్యయుగంలో అందరూ పవిత్రంగానే ఉంటారు. ఇది కూడా మీకిప్పుడు తెలుసు. ఇతరులకు అర్థం చేయించే శక్తి పిల్లలలో నంబరువారుగా ఉంటుంది. నంబరువారుగా స్మృతిలో ఉంటారు. రాజధాని ఎలా స్థాపనవుతుందో ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీరు సైన్యం కదా. స్మృతిబలంతో పవిత్రంగా అయి మేము రాజా రాణులుగా అవుతున్నామని మీకు తెలుసు. తర్వాత మరుసటి జన్మలో గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ ఉంటుంది. పెద్ద పరీక్ష పాస్ అయ్యేవారికి పెద్ద పదవి లభిస్తుంది. తేడా ఉంటుంది కదా, ఎంతగా చదువుకుంటే అంతగా సుఖం లభిస్తుంది. ఇదైతే భగవంతుడు చదివిస్తున్నారు. ఈ నషా ఎక్కి ఉండాలి. మీకు చాలా శక్తిశాలీ భోజనం లభిస్తుంది. భగవంతుడు కాకుండా ఇటువంటి భగవాన్-భగవతీలుగా ఎవరు తయారుచేస్తారు. మీరిప్పుడు పతితం నుండి పావనంగా అవుతున్నారు, మళ్ళీ జన్మ-జన్మాంతరాలకు సుఖవంతులుగా అయిపోతారు. ఉన్నత పదవిని పొందుతారు. చదువుకుంటూ-చదువుకుంటూ మళ్ళీ అశుద్ధంగా అయిపోతారు. దేహాభిమానంలోకి రావడం వలన మళ్ళీ జ్ఞానం యొక్క మూడవ నేత్రం సమాప్తమైపోతుంది. మాయ చాలా శక్తివంతమైనది. ఇందులో చాలా శ్రమ ఉంది, బ్రహ్మా తనువులోకి వచ్చి నేను ఎంత శ్రమ చేస్తున్నాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. కొందరు దీన్ని అర్థం చేసుకుంటారు, తర్వాత, శివబాబా వచ్చి చదివించడం అనేది ఎలా జరుగుతుంది – మేము ఒప్పుకోము అని మళ్ళీ అంటారు. ఇవి వారి తెలివితేటలు. ఈ విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. రాజ్యం అయితే స్థాపన జరుగుతుంది. సత్యమైన నావ కదులుతుంది కాని మునగదు అని అంటారు కదా. ఎన్నో విఘ్నాలు వస్తాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగాగ్నితో వికారాల తుప్పును తొలగించుకోవాలి. మా బుద్ధి అశుద్ధత వైపు వెళ్ళడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి.

2. నిశ్చయబుద్ధి కలవారిగా అయిన తర్వాత మళ్ళీ ఏ విషయములోనూ సంశయం రాకూడదు. వికర్మల నుండి రక్షింపబడేందుకు ఏ కర్మ చేసినా తమ స్వధర్మంలో స్థితులై తండ్రి స్మృతిలో చేయాలి.

వరదానము:- సర్వ ప్రాప్తుల అనుభవం ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సఫలతామూర్త భవ

ఎవరైతే సర్వ ప్రాప్తుల అనుభవీ మూర్తులుగా ఉంటారో వారే శక్తిశాలులు, అటువంటి శక్తిశాలి, సర్వ ప్రాప్తుల అనుభవీ ఆత్మలే సఫలతా మూర్తులుగా అవ్వగలరు, ఎందుకంటే ఇప్పుడు సర్వాత్మలు సుఖ-శాంతులనిచ్చే మాస్టర్ దాతలు ఎక్కడ ఉన్నారని వెతుకుతారు. కనుక మీ వద్ద సర్వశక్తుల స్టాక్ ఉన్నప్పుడే అందరినీ సంతుష్టపరచగలరు. ఈ రోజుల్లో ఏ విధంగా ఒకే స్టోరు నుండి అన్ని వస్తువులు లభిస్తాయో, అదే విధంగా మీరు కూడా తయారవ్వాలి. సహనశక్తి ఉండి, ఎదుర్కునే శక్తి లేకుండా ఉండకూడదు. సర్వశక్తుల స్టాక్ ఉండాలి, అప్పుడే సఫలతామూర్తులుగా అవ్వగలరు.

స్లోగన్:- మర్యాదలే బ్రాహ్మణ జీవితపు అడుగులు, అడుగులపై అడుగులు వేయడం అంటే గమ్యానికి సమీపంగా చేరుకోవడం.

పురుషార్థము మరియు ప్రాబ్ధంతో తయారుచేయబడిన అనాది డ్రామా

మాతేశ్వరి:- పురుషార్థము మరియు ప్రారబ్ధము రెండు విషయాలు, పురుషార్థంతో ప్రారబ్ధము తయారవుతుంది. ఈ అనాది సృష్టిచక్రము తిరుగుతూ ఉంటుంది, పూజ్యులుగా ఉండే ఆది సనాతన భారతవాసులు మళ్ళీ పూజారులుగా అయ్యారు, మళ్ళీ ఆ పూజారులే పురుషార్థం చేసి పూజ్యులుగా అవుతారు, ఈ ఎక్కడం మరియు దిగడం గల అనాది డ్రామా యొక్క ఆట తయారుచేయబడింది.

జిజ్ఞాసులు:- మాతేశ్వరీ, నాకు ఈ ప్రశ్న కూడా ఉంది, ఈ డ్రామా ఈ విధంగా తయారైనప్పుడు ఒకవేళ పైకి ఎక్కేది ఉంటే తమంతట తామే ఎక్కుతారు, మరి పురుషార్థము చేయడం వలన లాభమేముంటుంది? ఎవరైతే ఎక్కుతారో వారు మళ్ళీ దిగుతారు కనుక ఇంత పురుషార్థము ఎందుకు చేయాలి? మాతేశ్వరీ, మీరు ఈ డ్రామా యథావిధిగా పునరావృతమౌతుందని చెప్తున్నారు, మరి సర్వశక్తివంతుడైన పరమాత్మ సదా ఇటువంటి ఆటను చూస్తూ స్వయం అలసిపోరా? నాలుగు ఋతువులలో ఏ విధంగా చలి, వేడి మొదలైనవాటిలో తేడాలు ఉంటాయో, అలా ఈ ఆటలో తేడా ఉండదా?

మాతేశ్వరి:- ఇదే ఈ డ్రామాలోని ప్రత్యేకత, యథావిధిగా పునరావృతమౌతుంది మరియు ఈ డ్రామాలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇది రిపీట్ అవుతున్నా కూడా నిత్యం కొత్తదిగా అనిపిస్తుంది. మొదట మాకు కూడా ఈ శిక్షణ లేదు, కానీ జ్ఞానము లభించిన తర్వాత, క్షణ-క్షణం ఏదైతే నడుస్తుందో, అది యథావిధిగా కల్పక్రితముదే నడుస్తున్నా కానీ, సాక్షీగా భావిస్తూ చూసినట్లయితే నిత్యం కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు సుఖం, దుఃఖం రెండింటి పరిచయం లభించింది కనుక, ఒకవేళ ఫెయిల్ అవ్వాల్సిందే అన్నప్పుడు ఇంకెందుకు చదవాలి అని అనుకోకూడదు. మరి అలాగైతే, ఒకవేళ భోజనం లభించాల్సి ఉంటే దానంతట అదే లభిస్తుందని భావించాలి, మళ్ళీ ఇంత శ్రమ చేసి ఎందుకు సంపాదిస్తారు? అదే విధంగా ఇప్పుడు ఎక్కేకళ యొక్క సమయం వచ్చింది అని మనం కూడా చూస్తున్నాము, అదే దేవతా వంశం స్థాపన జరుగుతుంది, మరి ఇప్పుడే ఆ సుఖము ఎందుకు తీసుకోకూడదు. చూడండి, ఇప్పుడు ఎవరైనా జడ్జిగా అవ్వాలనుకుంటే, పురుషార్థము చేస్తేనే ఆ డిగ్రీని పొందుతారు కదా. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే శ్రమ అంతా వృథా అయిపోతుంది. కానీ ఈ అవినాశీ జ్ఞానంలో అలా జరగదు, ఈ అవినాశీ జ్ఞానం కొంచెం కూడా వినాశనమవ్వదు, దైవీ రాయల్ వంశంలోకి వచ్చే పురుషార్థం చేయలేకపోయినా కానీ, ఒకవేళ తక్కువ పురుషార్థం చేసినా కూడా ఆ సత్యయుగీ దైవీ ప్రజలలోకి రాగలరు. కానీ పురుషార్థం తప్పకుండా చేయాలి, ఎందుకంటే పురుషార్థం ద్వారానే ప్రారబ్ధము తయారవుతుంది, పురుషార్థముదే బలిహారం అని గాయనం చేయబడింది.

ఈ ఈశ్వరీయ జ్ఞానము సర్వ మనుష్యాత్మలోసం ఉంది

మొట్టమొదట మీరు ఒక ముఖ్యమైన పాయింటును తప్పకుండా ధ్యానంలో ఉంచుకోవాలి, ఈ మనుష్య సృష్టి యొక్క వృక్షానికి బీజరూపుడు పరమాత్మ అయినప్పుడు, ఆ పరమాత్మ ద్వారా ప్రాప్తిస్తున్న జ్ఞానం మనుష్యలందరికీ అవసరం. ఈ జ్ఞానము తీసుకునేందుకు అన్ని ధర్మాల వారికి అధికారముంది. ప్రతి ఒక్క ధర్మానికి వారి జ్ఞానముంటుంది, ప్రతి ఒక్కరికీ వారి శాస్త్రముంటుంది, ప్రతి ఒక్కరికీ వారి మతము ఉంటుంది, ప్రతి ఒక్కరికీ వారి సంస్కారముంటుంది, కానీ ఈ జ్ఞానము అందరి కోసం. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేకపోయినా, మన వంశంలోకి రాలేకపోయినా కానీ, వారు అందరికీ తండ్రి అయిన కారణంగా వారితో యోగము జోడించడంతో తప్పకుండా పవిత్రంగా అయిపోతారు. ఈ పవిత్రత కారణంగా తమ సెక్షన్ లోనే పదవిని తప్పకుండా పొందుతారు ఎందుకంటే యోగాన్ని మనుష్యులందరూ అంగీకరిస్తారు, చాలా మంది మనుష్యులు మాకు కూడా ముక్తి కావాలని అంటారు, అయితే శిక్షల నుండి ముక్తి అయ్యేటటువంటి శక్తి కూడా ఈ యోగం ద్వారానే లభించగలదు. అచ్ఛా – ఓంశాంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *