Telugu Murli 29/08/2020

29-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

“మధురమైనపిల్లలూ – అవినాశీ జ్ఞానరత్నాలను ధారణ చేసి మీరిప్పుడు ఫకీరుల నుండి అమీరులుగా అవ్వాలి, ఆత్మలైన మీరు రూపబసంత్ లు (జ్ఞాన యోగాలు కలిగినవారు)”

ప్రశ్న:- ఎటువంటి శుభ భావన ఉంచుకొని పురుషార్థములో సదా తత్పరులై ఉండాలి?

జవాబు:- ఆత్మనైన నేను సతోప్రధానంగా ఉండేవాడిని, నేనే తండ్రి నుండి శక్తి యొక్క వారసత్వాన్ని తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాను అని సదా ఇదే శుభభావన ఉండాలి. ఇదే శుభభావనతో పురుషార్థము చేసి సతోప్రధానంగా అవ్వాలి. అందరూ సతోప్రధానంగా అవ్వరు కదా అని భావించకూడదు. స్మృతి యాత్రలో ఉండే పురుషార్థము చేస్తూనే ఉండాలి, సేవ ద్వారా శక్తిని తీసుకోవాలి.

గీతము:- ఈ పాపపు ప్రపంచము నుండి దూరంగా తీసుకువెళ్ళు ప్రభూ….. (ఇస్ పాప్ కీ దునియా సే…..)

ఓంశాంతి. ఇది చదువు. ప్రతి ఒక్క విషయాన్ని అర్థము చేసుకోవాలి, మిగిలిన సత్సంగాలు మొదలైనవన్నీ భక్తికి చెందినవి. భక్తి చేస్తూ-చేస్తూ బెగ్గర్ గా అయిపోయారు. ఆ బెగ్గర్లు (ఫకీరులు) వేరు, మీరు ఇంకో రకమైన బెగ్గర్లు. మీరు అమీరులుగా ఉండేవారు, ఇప్పుడు ఫకీరులుగా అయిపోయారు. మేము అమీరులుగా ఉండేవారమని ఎవ్వరికీ తెలియదు, మేము విశ్వానికి యజమానులుగా, అమీరులుగా ఉండేవారమని బ్రాహ్మణులైన మీకు తెలుసు. అమీర్ చంద్ నుండి ఫకీర్ చంద్ గా అయ్యాము. ఇప్పుడిది చదువు, దీనిని బాగా చదువుకోవాలి, ధారణ చేయాలి మరియు ధారణ చేయించే ప్రయత్నము చేయాలి. అవినాశీ జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. ఆత్మ రూప్ బసంత్ కదా. ఆత్మయే ధారణ చేస్తుంది, శరీరమైతే వినాశి. పనికిరాని వస్తువులను కాలుస్తారు. శరీరము కూడా పనికిరాదు కనుక దానిని అగ్నిలో కాలుస్తారు. ఆత్మనైతే కాల్చరు. మనము ఆత్మలము, రావణ రాజ్యము ప్రారంభమైనప్పటి నుండి మనుష్యులు దేహాభిమానములోకి వచ్చేశారు. నేను శరీరాన్ని అన్నది పక్కా అయిపోతుంది. ఆత్మ అయితే అమరమైనది. అమరనాథుడైన తండ్రి వచ్చి ఆత్మలను అమరంగా తయారుచేస్తారు. అక్కడైతే తమ సమయానికి తమ ఇష్టంతో ఒక శరీరాన్ని వదలి మరొకటి తీసుకుంటారు ఎందుకంటే ఆత్మ యజమాని. ఎప్పడు కావాలనుకుంటే, అప్పుడు శరీరాన్ని వదలగలదు. అక్కడ శరీరం యొక్క ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. సర్పము ఉదాహరణ ఉంది. ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మలోని పాత శరీరమని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తిగా తీసుకున్నాము. కొందరికి 60-70 జన్మలు కూడా ఉంటాయి, కొందరికి 50 జన్మలు, త్రేతా యుగములో తప్పకుండా ఆయుష్షు ఎంతో కొంత తగ్గిపోతుంది. సత్యయుగంలో పూర్తి ఆయుష్షు ఉంటుంది. మేము సత్యయుగంలో ప్రారంభంలోనే రావాలని ఇప్పుడు పురుషార్థము చేయాలి. అక్కడ శక్తి ఉంటుంది కనుక అకాల మృత్యువులుండవు. శక్తి తగ్గిపోతే ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు తండ్రి ఏ విధంగా సర్వశక్తివంతుడో, అదే విధంగా ఆత్మను కూడా శక్తివంతంగా తయారుచేస్తారు. ఒకటి పవిత్రంగా అవ్వాలి మరియు స్మృతిలో ఉండాలి, అప్పుడే శక్తి లభిస్తుంది. తండ్రి నుండి శక్తి యొక్క వారసత్వం తీసుకుంటారు. పాపాత్మలైతే శక్తిని తీసుకోలేరు. పుణ్యాత్మలుగా అయినప్పుడే శక్తి లభిస్తుంది. ఆత్మలైన మేము సతోప్రధానంగా ఉండేవారమని భావించండి. ఎల్లప్పుడూ శుభభావననే ఉంచుకోవాలి. అందరూ అయితే సతోప్రధానంగా ఉండరు, కొందరు సతోగా కూడా ఉంటారు కదా అని అనుకోకండి. మేము మొట్టమొదట సతోప్రధానంగా ఉండేవారమని స్వయం భావించాలి. నిశ్చయం ద్వారానే సతోప్రధానంగా అవుతారు. మేము సతోప్రధానంగా ఎలా అవ్వగలము అని అడగకూడదు. లేకపోతే మళ్ళీ జారిపోతారు. స్మృతియాత్రలో ఉండలేరు. ఎంత వీలైతే అంత పురుషార్థము చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సతోప్రధానంగా అవ్వాలి. ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ తమోప్రధానంగా ఉన్నారు. ఆత్మలైన మీరు కూడా తమోప్రధానంగా ఉన్నారు. ఆత్మను ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా చేయాలి. దానితో పాటుగా సేవ కూడా చేసినట్లయితే శక్తి లభిస్తుంది. ఎవరైనా సెంటర్ తెరిచినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు వారి శిరస్సుపై ఉంటాయి. ఎవరైనా వచ్చి విశ్రాంతి పొందేలా మనుష్యులు ధర్మశాలలు నిర్మిస్తారు. ఆత్మకు సంతోషము కలుగుతుంది కదా. అందులో ఉండేవారు విశ్రాంతి పొందితే, నిర్మించినవారికి వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. దాని పరిణామం ఏమిటి? మరుసటి జన్మలో వారు సుఖంగా ఉంటారు. మంచి ఇల్లు లభిస్తుంది. మంచి ఇంట్లో ఉండే సుఖము లభిస్తుంది. అలాగని ఎప్పుడూ వ్యాధిగ్రస్థులు అవ్వరని కాదు. కేవలం మంచి ఇల్లు లభిస్తుంది. ఆసుపత్రి తెరిస్తే మంచి ఆరోగ్యము లభిస్తుంది. విశ్వవిద్యాలయము తెరిస్తే మంచి చదువు లభిస్తుంది. స్వర్గంలోనైతే ఈ ఆసుపత్రులు మొదలైనవి ఉండవు. ఇక్కడ మీరు పురుషార్థము ద్వారా 21 జన్మలకు ప్రారబ్ధమును తయారుచేసుకుంటారు. అయితే అక్కడ ఆసుపత్రులు, కోర్టులు, పోలీసులు మొదలైనవేవీ ఉండవు. ఇప్పుడు మీరు సుఖధామములోకి వెళ్తున్నారు. అక్కడ మంత్రులు కూడా ఉండరు. ఉన్నతాతి ఉన్నతమైన మహారాజా-మహారాణి, మంత్రి సలహాలను తీసుకోరు. బుద్ధిహీనులుగా అయినప్పుడు, వికారాలలో పడిపోయినప్పుడు సలహాలు తీసుకుంటారు. రావణరాజ్యంలో పూర్తిగా బుద్ధిహీనులుగా తుచ్ఛబుద్ధి కలవారిగా అయిపోతారు, అందుకే వినాశనం యొక్క మార్గాన్ని వెతుకుతూ ఉంటారు. మేము విశ్వాన్ని చాలా ఉన్నతంగా తయారుచేస్తామని స్వయం భావిస్తారు కానీ ఇంకా కిందకే పడిపోతూ ఉంటారు. ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది.

ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. మేము భారత్ కు సేవ చేసి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాము. తర్వాత మేము రాజ్యము చేస్తాము. ఫాలో ఫాదర్ అని గాయనం కూడా ఉంది. తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు, పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. ఈ సమయంలో శివబాబా బ్రహ్మా తనువులోకి వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఈ విధంగా అర్థం చేయించాలి. మేము బ్రహ్మాను భగవంతుడు లేక దేవత మొదలైనవారిగా భావించము. వీరు పతితంగా ఉండేవారు, తండ్రి పతిత శరీరములో ప్రవేశించారు. వృక్షం చిత్రములో చూడండి, పైన పిలక స్థానంలో నిలబడి ఉన్నారు కదా. పతితంగా ఉన్నారు, మళ్ళీ పావనంగా అయ్యేందుకు కింద తపస్సు చేసి మళ్ళీ దేవతగా అవుతారు. తపస్సు చేసేవారు బ్రాహ్మణులు. బ్రహ్మాకుమార-కుమారీలైన మీరందరూ రాజయోగము నేర్చుకుంటున్నారు. ఎంత స్పష్టంగా ఉంది. ఇందులో యోగము చాలా బాగుండాలి. స్మృతిలో ఉండకపోతే మురళీలో కూడా ఆ శక్తి ఉండదు. శివబాబా స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవుతారు, లేకపోతే శిక్షలు అనుభవించి మళ్ళీ తక్కువ పదవిని పొందుతారు. స్మృతియే ముఖ్యమైన విషయము, దీనినే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటారు. జ్ఞానము గురించి ఎవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలు మాకు తెలియవని ఇంతకుముందు ఋషులు-మునులు అనేవారు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. ఈ పంచ వికారాలే మిమ్మల్ని పూర్తిగా పైసా అంత విలువ కూడా లేనివారిగా తయారుచేసాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము కాలిపోయి పూర్తిగా సమాప్తమైపోతుంది. ఇంకేమీ మిగలదు. మీరందరూ భారత్ ను స్వర్గంగా చేసేందుకు నంబరువారు పురుషార్థానుసారంగా తనువు-మనసు-ధనము ద్వారా సేవ చేస్తారు. ప్రదర్శనీలో కూడా మిమ్మల్ని అడిగినప్పుడు బి.కె.లైన మేము శ్రీమతంపై మా తనువు-మనస్సు-ధనము ద్వారా సేవ చేసి రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని చెప్పండి. శ్రీమతంపై మేము రామరాజ్యాన్ని స్థాపిస్తున్నామని గాంధీజీ కూడా ఈ విధంగా అనేవారు కాదు. ఇక్కడైతే వీరిలో శ్రీ శ్రీ 108, తండ్రి కూర్చున్నారు. 108 మాల కూడా తయారుచేస్తారు. మాల అయితే పెద్దదిగా తయారవుతుంది. ఇందులో 8-108 బాగా శ్రమ చేస్తారు. బాగా శ్రమించేవారు, నంబరువారుగా చాలామంది ఉన్నారు. రుద్ర యజ్ఞము చేసినప్పుడు సాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. తప్పకుండా ఏదో సేవ చేసి ఉంటారు కనుకనే పూజ జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు ఆత్మిక సేవాధారులు. ఆత్మలందరినీ మేల్కొల్పేవారు. నేను ఆత్మను, ఇది మర్చిపోతే దేహాభిమానము వచ్చేస్తుంది. నేను ఫలానా అని భావిస్తారు. నేను ఆత్మను – అని ఎవ్వరికీ తెలియదు, ఫలానా పేరు అనేది ఈ శరీరానికి సంబంధించినది. ఆత్మనైన నేను ఎక్కడ నుండి వస్తాను అన్న ఆలోచన ఏ మాత్రం ఎవ్వరికీ లేదు. ఇక్కడ పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ శరీర భానం పక్కా అయిపోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు – పిల్లలూ, ఇప్పుడు పొరపాట్లు చేయకండి, మాయ చాలా శక్తివంతమైనది, మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండి. ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళా. ఆత్మ-పరమాత్మ వేరై చాలాకాలము అయ్యిందని గాయనముంది. దీని అర్థము కూడా వారికి తెలియదు. ఆత్మలైన మనము తండ్రితోపాటు ఉండేవారమని మీరిప్పుడు తెలుసుకున్నారు. అది ఆత్మల ఇల్లు కదా. తండ్రి కూడా అక్కడే ఉన్నారు, వారి పేరు శివ. శివజయంతి కూడా గాయనం చేయబడుతుంది, వారికి ఇంకే పేరు ఇవ్వకూడదు. నా అసలు పేరు కళ్యాణకారి శివ అని తండ్రి చెప్తున్నారు. కళ్యాణకారి రుద్రుడని అనరు. కళ్యాణకారి శివ అని అంటారు. కాశీలో కూడా శివుని మందిరముంది కదా. అక్కడకి వెళ్ళి సాధువులు శివ కాశీ విశ్వనాథ గంగ అని మంత్రం జపిస్తారు. కాశీ మందిరములో కూర్చోబెట్టిన శివుడిని విశ్వనాథుడని అంటారని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నేను విశ్వనాథుడిని కాను. మీరు విశ్వానికి నాథులుగా అవుతారు. నేను అసలు అవ్వను. బ్రహ్మ తత్వానికి కూడా మీరు నాథులుగా అవుతారు. అది మీ ఇల్లు. అది రాజధాని. ఒక్క బ్రహ్మతత్వము మాత్రమే నా ఇల్లు. నేను స్వర్గములోకి రాను. నేను నాథునిగా కూడా అవ్వను. నన్నే శివబాబా అని అంటారు. పతితులను పావనంగా చేయడమే నా పాత్ర. సిక్కులు కూడా మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేశారని…… అంటారు కానీ దాని అర్థము తెలియదు. ఏక్ ఓంకార్…… అని మహిమ కూడా పాడుతారు. వారిని అయోనిజుడు అని అంటారు అంటే జనన-మరణ రహితుడు. నేనైతే 84 జన్మలు తీసుకోను. నేను వీరిలో ప్రవేశిస్తాను. మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు. బాబా నాతో కలిసి కూర్చుని ఉన్నా కూడా క్షణ-క్షణము స్మృతిని మర్చిపోతారని వీరి ఆత్మకు తెలుసు. నేను చాలా శ్రమ చేయవలసి ఉంటుంది అని ఈ దాదా ఆత్మ చెప్తుంది. నాతోనే కూర్చుని ఉన్నారు కనుక స్మృతి బాగుంటుందని కాదు. అలా ఉండదు. పూర్తిగా కలిసే ఉన్నారు. నా దగ్గరే ఉన్నారని తెలుసు. ఈ శరీరానికి వారు యజమాని వలె ఉన్నారు. అయినా మర్చిపోతాను. బాబా ఉండేందుకు ఈ శరీరము ఇచ్చాము. అయితే ఒక మూలలో నేను కూర్చుని ఉన్నాను. గొప్ప వ్యక్తి కదా. ప్రక్కన యజమాని కూర్చున్నారని అనుకుంటాను. ఈ రథము వారిది. వారే దీన్ని సంభాళిస్తారు. నాకు శివబాబా తినిపిస్తారు కూడా. నేను వారి రథాన్ని. కావున పాలన అయితే చేస్తారు. ఈ సంతోషంలో తింటాను. రెండు-నాలుగు నిమిషాల తర్వాత మర్చిపోతాను, పిల్లలకు ఎంత శ్రమ అనిపిస్తుంది అని అప్పుడు అనుకుంటాను, అందుకే ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. దీనిలో చాలా-చాలా లాభముంది. ఇక్కడైతే చిన్న విషయానికే విసిగిపోతారు, తర్వాత చదువును వదిలేస్తారు. బాబా-బాబా అంటూనే విడాకులిచ్చేస్తారు. తండ్రిని తమవారిగా చేసుకుంటారు, జ్ఞానాన్ని వినిపిస్తారు, ఇష్టపడతారు, దివ్యదృష్టితో స్వర్గాన్ని చూస్తారు, రాస్ చేస్తారు, ఓహెూ మాయ, నాకు విడాకులిచ్చి, పారిపోతారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా చేస్తారో వారికే విడాకులిచ్చేస్తారు. గొప్ప-గొప్ప పేరు-ప్రఖ్యాతలున్నవారు కూడా విడాకులిచ్చేస్తారు.

మీకిప్పుడు మార్గము తెలియజేయడం జరిగింది. అలాగని చేయి పట్టుకుని తీసుకువెళ్తారని కాదు. మీరు నేత్రాలు లేని అంధులైతే కాదు. అవును, జ్ఞానం యొక్క మూడవ నేత్రము మీకు లభిస్తుంది. సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలు మీకు తెలుసు. ఈ 84 జన్మల చక్రము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. మీ పేరు స్వదర్శన చక్రధారి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. చివర్లో ఈ స్థితి ఉండాలి. స్ర్తీకి పురుషుని పట్ల ప్రేమ ఉంటుంది. వారిది దైహిక ప్రేమ, ఇక్కడ మీది ఆత్మిక ప్రేమ. మీరు లేస్తూ-కూర్చుంటూ, పతులకే పతిని, తండ్రులకే తండ్రిని స్మృతి చేయాలి. స్ర్తీ-పురుషులు మరియు పరివారం పరస్పరం చాలా ప్రేమగా ఉండేటటువంటి ఇల్లులు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇల్లు స్వర్గము వలె ఉంటుంది. 5-6 మంది పిల్లలు కలిసే ఉంటారు, ఉదయమే త్వరగా లేచి పూజలో కూర్చుంటారు, ఇంట్లో గొడవలు మొదలైనవేవి ఉండవు. ఏకరసంగా ఉంటారు. కొన్ని చోట్ల ఒకే ఇంటిలో కొందరు రాధా స్వామి శిష్యులుంటారు, కొందరు అసలు ధర్మాన్నే నమ్మరు. చిన్న విషయాలకే అలజడి చెందుతారు. కనుక ఈ అంతిమ జన్మలో పూర్తిగా పురుషార్థము చేయాలి అని తండ్రి చెప్తున్నారు. మీ ధనాన్ని కూడా సఫలం చేసుకొని మీ కళ్యాణం చేసుకోండి. అప్పుడు భారత్ యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది. మేము శ్రీమతంపై మా రాజధానిని మళ్ళీ స్థాపిస్తున్నామని మీకు తెలుసు. స్మృతియాత్ర ద్వారా మరియు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడం ద్వారానే మనము చక్రవర్తీ రాజులుగా అవుతాము, మళ్ళీ దిగడం ప్రారంభమౌతుంది. తర్వాత అంతిమంలో బాబా వద్దకు వచ్చేస్తాము. శ్రీమతంపై నడవడం ద్వారానే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి ఉరికంబం ఏమీ ఎక్కించడం లేదు. ఒకటి పవిత్రంగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. సత్యయుగంలో పతితులెవ్వరూ ఉండరు. దేవీ-దేవతలు కూడా చాలా కొద్దిమందే ఉంటారు. తర్వాత నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. దేవతలది చిన్న వృక్షము. తర్వాత ఎంతో వృద్ధి చెందుతుంది. ఆత్మలన్నీ వస్తూ ఉంటాయి, ఇది తయారై-తయారవుతున్న ఆట. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక సేవాధారులుగా అయి ఆత్మలను మేల్కొలిపే సేవ చేయాలి. తనువు-మనసు-ధనంతో సేవ చేసి శ్రీమతంపై రామరాజ్య స్థాపనకు నిమిత్తంగా అవ్వాలి.

2. స్వదర్శన చక్రధారులుగా అయి 84 జన్మల చక్రాన్ని బుద్ధిలో తిప్పాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. ఎప్పుడూ ఏ విషయములోనూ విసుగు చెంది చదువును వదిలేయకూడదు.

వరదానము:- తండ్రి మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా ధైర్యం-ఉత్సాహంలో ఉండే ఏకరస, అచల భవ

జన్మించడంతోనే తండ్రి ద్వారా లభించిన ప్రాప్తుల లిస్టును సదా ఎదురుగా ఉంచుకోండి. ప్రాప్తి స్థిరంగా, అచలంగా ఉన్నప్పుడు ధైర్యము మరియు ఉత్సాహము కూడా అచలంగా ఉండాలి. అచలంగా ఉండేందుకు బదులుగా ఒకవేళ మనసు ఎప్పుడైనా చంచలంగా అయినట్లయితే లేక స్థితి చంచలత్వంలోకి వచ్చినట్లయితే దానికి కారణం తండ్రిని మరియు ప్రాప్తిని సదా ఎదురుగా ఉంచుకోకపోవడం. సర్వ ప్రాప్తుల అనుభవం సదా ఎదురుగా ఉన్నట్లయితే మరియు స్మృతిలో ఉన్నట్లయితే విఘ్నాలన్నీ సమాప్తమైపోతాయి, సదా కొత్త ఉత్సాహము, కొత్త ఉల్లాసము ఉంటుంది. స్థితి ఏకరసంగా మరియు అచలంగా ఉంటుంది.

స్లోగన్:- ఏ రకమైన సేవలోనైనా సదా సంతుష్టంగా ఉండడమే మంచి మార్కులు తీసుకోవడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *